ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు మసూద్ అజర్ ఉగ్ర హెచ్చరికలు, ఆడియో వైరల్

international |  Suryaa Desk  | Published : Sun, Jan 11, 2026, 07:34 PM

నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత.. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ పేరుతో ఉన్న ఒక ఆడియో రికార్డింగ్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. భారత్‌పై దాడులు చేయడానికి వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని ఈ ఆడియోలో అతడు హెచ్చరించడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఆ ఆడియోలో మసూద్ అజర్ భారత్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒకరు, ఇద్దరు కాదు.. వందల్లో కూడా కాదు.. వెయ్యి కంటే ఎక్కువే ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని.. పేర్కొన్నాడు. తాను గనుక పూర్తి సంఖ్యను వెల్లడిస్తే.. రేపు అంతర్జాతీయ మీడియాలో పెద్ద దుమారం రేగుతుంది అని పేర్కొన్నాడు.


భారత్‌లోకి చొరబడి దాడులు చేయడానికి తన అనుచరులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని.. వారు రక్తపాతానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఆడియోలో మసూద్ అజార్ చెబుతున్నట్లుగా వినిపించింది. అయితే ఈ ఆడియో ఎప్పుడు రికార్డ్ అయిందనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. గతేడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత.. భారత దళాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయి.


అందులో భాగంగా పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేశాయి. ఇందులో మసూద్ అజర్ సన్నిహితులు, బంధువులు మొత్తం 11 మంది హతం అయ్యారు. దానికి ప్రతీకారంగానే ఈ తాజా హెచ్చరికలు వచ్చినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.


ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మారణకాండ వెనుక కూడా జైషే మహ్మద్ హస్తం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో పట్టుబడ్డ ఉమర్ మహమ్మద్ అనే నిందితుడికి జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.


మసూద్ అజర్ ఆచూకీ?


2019 తర్వాత మసూద్ అజర్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. 2019లో బహవల్పూర్‌లో అతని స్థావరంపై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన భారీ పేలుడులో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి అతను రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నాడు. పాకిస్తాన్ గడ్డపై నుంచే మసూద్ అజార్ భారత్‌పై దాడులకు వ్యూహరచన చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa