ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఏ గ్రూప్ ఉద్యోగులకు ఎంత పెరుగుతుందంటే

business |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 11:51 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లు.. ఇప్పుడు 8వ వేతన సంఘం ఎప్పుడు అమలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమలైతే.. దాని సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు.. పెన్షనర్ల పింఛన్ వంటివి పెరుగుతాయని చెప్పొచ్చు. గతేడాది జనవరిలోనే ఈ వేతన సంఘం ఏర్పాటును కేంద్రం ప్రకటించినా.. కమిషన్ విధివిధానాల రూపకల్పనలో చాలా ఆలస్యం జరిగింది. దీంతో అమలు కాస్తా వాయిదా పడింది. 2025 నవంబరులో విధివిధానాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అప్పటినుంచి 18 నెలల వరకు సిఫార్సులు సమర్పించేందుకు గడువు ఉంది. దీంతో 8వ వేతన సంఘం ఏర్పాటు అయ్యేందుకు మరో సంవత్సరంన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుందని అంతా భావిస్తున్నారు.


అయితే ఎప్పుడు వేతన సంఘం అమలైనా.. ఉద్యోగులకు జీతభత్యాలు పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక జీతాల పెంపు, ఇతర అలవెన్సులు, డీఏ వంటి వాటిని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తుంది. దీనిని కమిషన్ అంచనా వేసి.. కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అప్పుడు ఉద్యోగుల జీతాలు పెరిగేందుకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. కానీ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. ఇది 2.15 లేదా 2.57 లేదా 2.86 గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే బేసిక్ పే ఇన్ని రెట్ల మేర పెరుగుతుందని చెప్పొచ్చు.


 >> అంతకుముందు 7వ వేతన కమిషన్ కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 గా నిర్ణయించారు. దీంతో 6వ వేతన సంఘంలో ఉద్యోగుల బేసిక్ పే రూ. 7,440 గా ఉండగా.. ఇది 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు అనుగుణంగా రూ. 18 వేలకు పెరిగింది. ఇప్పుడు ఆర్థిక నిపుణులు Nexdigm పేరోల్ సర్వీసెస్ డైరెక్టర్ రామచంద్రన్ కృష్ణమూర్తి; కర్మా మేనేజ్మెంట్ గ్లోబల్ కన్సల్టింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, చీఫ్ విజన్ ఆఫీసర్ ప్రతీక్ వైద్య ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై తమ అంచనాల్ని వెలువరించారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 8వ వేతన సంఘంలో 1.83-2.46 మధ్య ఉంటుందని వైద్య అంచనా వేశారు. కృష్ణమూర్తి ఇది 1.9-2.5 రేంజ్‌లో ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటే.. ఏ స్థాయి ఉద్యోగులకు బేసిక్ పే ఏ స్థాయిలో పెరగొచ్చో లెక్కలు చూద్దాం.


>> ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.15 గా అంచనా వేస్తే.. లెవెల్ 1 (ఎంట్రీ లెవెల్, గ్రూప్- డి) వారికి ప్రస్తుత బేసిక్ పే రూ. 18 వేలుగా ఉండగా.. ఇది రూ. 38,700 కు చేరుతుంది. ఇక్కడ బేసిక్ పే పెరుగుదల రూ. 20,700 గా ఉంటుంది.


లెవెల్ 10 (ఎంట్రీ లెవెల్, గ్రూప్- ఏ) వారికి ప్రస్తుత బేసిక్ పే రూ. 56,100 గా ఉండగా.. రూ. 1,20,615 కు పెరుగుతుంది. ఇక్కడ రూ. 64,515 పెరుగుతుందని చెప్పొచ్చు.


లెవెల్ 18 (గ్రూప్ ఏ సీనియర్ మోస్ట్ లెవెల్) కింద ప్రస్తుత బేసిక్ పే రూ. 2.50 లక్షలుగా ఉండగా.. ఇది రూ. 5,37,500 కు చేరుతుంది. ఇక్కడ బేసిక్ పే ఏకంగా రూ. 2,87,500 పెరుగుతుందన్నమాట.


ఇదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 గా ఉంటే ఎంత పెరుగుతుందో చూద్దాం. ఇక్కడ లెవెల్-1 ఉద్యోగుల బేసిక్ పే రూ. 18 వేల నుంచి రూ. 51,480 కి చేరుతుంది. ఇక్కడ ఏకంగా రూ. 33,480 పెరుగుతుందన్నమాట. లెవెల్ 10 వారికి రూ. 56,100 నుంచి రూ. 1,60,446 కు చేరుతుంది. ఇక్కడ రూ. 1 లక్షకుపైగా పెరుగుతుంది. లెవెల్ 18 ఉద్యోగులకు చూస్తే రూ. 2.50 లక్షల నుంచి రూ. 7,15,000 కు చేరుతుంది.


ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.. 7వ వేతన సంఘంలో నిర్ణయించిన 2.57 గానే మళ్లీ నిర్ణయిస్తే ఇక్కడ లెవెల్ 1 ఉద్యోగులకు రూ. 18 వేలుగా ఉన్న బేసిక్ పే రూ. 46,260 కు చేరుతుంది. ఇక్కడ రూ. 28,260 పెరుగుతుందని చెప్పొచ్చు. లెవెల్-10 ఉద్యోగులకు చూస్తే రూ. 56,100 గా ఉన్న ప్రస్తుత బేసిక్ పే రూ. 1,44,177 కు చేరుతుంది. ఇక్కడ రూ. 88,077 పెరుగుతుందన్నమాట. లెవెల్ 18 ఉద్యోగ స్థాయి వారికి రూ. 2.50 లక్షలుగా ఉన్న బేసిక్ పే రూ. 6,42,500 కు చేరుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa