ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విటమిన్ సి లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 11:33 PM

విటమిన్ సి మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. ఈ విటమిన్ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఐరన్ గ్రహించడానికి సాయపడే పోషకం. వ్యాధితో పోరాడే సామర్థ్యాన్ని పెంచడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం అవసరమని చాలా మందికి తెలుసు. విటమిన్ సి లోపం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అయితే, విటమిన్ సి లోపం అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని కొద్ది మందికి మాత్రమే తెలుసు.


అయితే, శరీరం దానిని స్వయంగా ఉత్పత్తి చేయలేకపోతుంది.కాబట్టి దానిని ఆహారం నుంచి పొందాలి. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుందని మనం చదువుకున్నాం.శరీరానికి సరిపడా విటమిన్ సి తీసుకోకపోతే ఈ వ్యాధి వస్తుంది. శరీరం ఈ విటమిన్‌ను నిల్వ చేయదు. అయితే, రోజువారీ మోతాదు ఈ లోపాన్ని భర్తీ చేస్తుంది. విటమిన్ సి లోపం ఉన్నవారు కొన్ని లక్షణాలను అనుభవిస్తారు. విటమిన్ సి లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రముఖ హార్వర్డ్ డాక్టర్ సౌరబ్ సేథీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చుద్దాం.


చిగుళ్ల నుంచి రక్తస్రావం


విటమిన్ సి లోపం చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది. విటమిన్ సి లోపం చిగుళ్లను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా వాపుకు గురి చేస్తుంది. దీనివల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం వస్తుంది. అంతేకాకుండా దంతాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. దంత క్షయం, చిగుళ్ల క్షయం సంభవించవచ్చు.


నోటి దుర్వాసన పెరుగుతుంది. చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ సి చాలా అవసరం. ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్ సి స్థాయిలు తక్కువగా ఉన్న రోగుల్లో చిగుళ్ళలో రక్తస్రావం 1.16 రెట్లు ఎక్కువగా ఉంటుంది. చిగుళ్ళలో రక్తస్రావం కూడా స్కర్వీకి సంకేతం కావచ్చు. ఇది విటమిన్ సి లోపం ఉన్న పరిస్థితి.


తరచుగా జబ్బు పడటం


మీరు తరచుగా అనారోగ్యానికి గురైతే.. విటమిన్ సి లోపం ఉందని అర్థం చేసుకోవాలి. విటమిన్ సి అనేది యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.


ఈ విటమిన్ గాయం మానడానికి, ఆరోగ్యకరమైన కొల్లాజెన్ ఏర్పడటానికి చాలా అవసరం. విటమిన్ సి తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అదే విటమిన్ సి లోపం ఉంటే మీరు తరచుగా జబ్బు పడుతుంటారు. పదే పదే మీకు రోగాలు వస్తుంటే అలర్ట్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు.


నెమ్మదిగా గాయం నయం కావడం, కీళ్ల నొప్పులు


మీకు నెమ్మదిగా గాయం నయం అయితే విటమిన్ సి లోపం ఉందని అర్థం. శస్త్రచికిత్స తర్వాత ఎక్కువ విటమిన్ సి తీసుకున్న రోగులు.. తీసుకోనివారి కంటే వేగంగా కోలుకున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.


విటమిన్ సి లోపం ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు ఈ నొప్పి అసాధారణంగా తీవ్రంగా ఉంటుంది. శరీరంలో వాపుకు కూడా కారణం కావచ్చు.


చర్మానికి సంబంధించి అనేక సమస్యలు


మీకు తగినంత విటమిన్ సి లభించకపోతే చర్మం గణనీయమైన మార్పులను అనుభవించవచ్చు. విటమిన్ సి లోపం ఎరుపు లేదా రంగు మారడానికి కారణమవుతుంది. ముఖ్యంగా మోచేతుల లోపలి భాగంలో గాయాలు సాధారణంగా కనిపిస్తాయి.


చర్మం పొడిగా మారుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడే విటమిన్ సి తగ్గడం వల్ల ముడతలు, వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయి. విటమిన్ సి లోపం వల్ల చర్మం పొడిబారి, నీరసంగా మారుతుంది. అంతేకాకుండా చర్మంపై సులభంగా గాయాలు కనిపిస్తాయి.


ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయి


విటమిన్ సి లోపం వల్ల అలసట, బలహీనత ఏర్పడవచ్చు. శరీరంలో శక్తి స్థాయిలు తగ్గి, కండరాలు సరిగ్గా పనిచేయలేనప్పుడు ఇది సంభవిస్తుంది. మీరు చిన్న చిన్న పనులకే అలసిపోయినట్టు అనిపిస్తే విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారని అర్థం.


విటమిన్ సి లోపం వల్ల కండరాల నొప్పి, వాపు వస్తుంది. ఇది కదలికను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి ముఖ్యంగా వృద్ధ రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.


విటమిన్ సి ఐరన్ శోషణకు సాయపడుతుంది. అందువల్ల, విటమిన్ సి లోపం ఐరన్ లోపానికి దారితీస్తుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. ఇది అలసట, తలతిరగడం, బలహీనతకు కారణమవుతుంది.


విటమిన్ సి లోపం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీని లోపం మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, ఒత్తిడికి దారితీస్తుంది. ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు.


విటమిన్ సి లోపం శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఉబ్బసం తీవ్రతరం కావడం లేదా లోతైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల్ని కలిగిస్తుంది.


విటమిన్ సి లోపం ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.


విటమిన్ సి లోపాన్ని ఎలా భర్తీ చేయాలి?


విటమిన్ సి లోపాన్ని నివారించడానికి, ఆహారంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మన శరీరాలు స్వయంగా విటమిన్ సి ఉత్పత్తి చేయలేవు లేదా నిల్వ చేయలేవు. అందువల్ల, ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా దానిని పొందడం చాలా ముఖ్యం.


నారింజ, కివీస్, స్ట్రాబెర్రీలు, జామ, టమోటాలు, నిమ్మకాయల్ని ఆహారంలో చేర్చుకోండి. టమాటాలు, బెల్ పెప్పర్స్, పాలకూర, బ్రకోలి వంటి వాటిలో కూడా విటమిన్ సి లభిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్ సి లోపాన్ని నివారించవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa