ఒకప్పుడు అత్యంత కటిక పేదరికంలో ఉండి.. సరైన తిండి లేక, సౌకర్యాలు లేక.. చదువు కోసం కిలోమీటర్ల మేర రోజూ నడిచి వెళ్లిన ఎంతో మంది ఇప్పుడు ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. విధి పగబట్టి, పరిస్థితులు అనుకూలించకపోయినా.. వాటన్నింటినీ దాటుకుని, ఎన్నో కష్టాలు దిగమింగి.. చివరికి విజయ తీరాలకు చేరిన వారి గాథలను మనం ఇప్పటివరకు విన్నాం. ఒకప్పుడు రూ.10 లేక అవస్థలు పడ్డవారు కూడా.. జీవితంలో ఎన్నో కష్టాలను చూసి వచ్చి ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యాలను స్థాపించిన వారు ఉన్నారు. అందులో ఒకరే థైరోకేర్ ఫౌండర్ డాక్టర్ ఏ వేలుమణి. తన పేదరికాన్నే ఆయుధంగా చేసుకుని డాక్టర్ వేలుమణి చేసిన పోరాటం విజయాన్ని అందించింది.
తన విద్యార్థి దశలో వేలుమణి రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై గంటల కొద్దీ చదువుకునేవారు. 1974 నుంచి 1978 వరకు కోయంబత్తూరు సమీపంలోని శ్రీ రామకృష్ణ మిషన్ విద్యాలయంలో (ఎస్ఆర్ఎంవీ) చదువుకున్నారు. అయితే ఆ సమయంలో కోయంబత్తూర్‌లోని కాలేజీ ఫీజులు రూ.1,000 నుంచి రూ.3 వేల వరకు ఉండేవి. కానీ కోయంబత్తూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎస్ఆర్ఎంవీలో మాత్రం ఫీజు కేవలం రూ.300 ఉండేది. అయితే కోయంబత్తూర్ నుంచి ఎస్ఆర్ఎంవీకి వెళ్లాలంటే బస్సు టికెట్ రోజుకు 60 పైసలు కాగా.. నెలకు రూ.30 ఖర్చు అయ్యేది.
అయితే ఆ బస్సు టికెట్ ధర కూడా ఖర్చు పెట్టలేని పేదరికంలో ఉన్న వేలుమణి.. రైలు పాస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. రూ.7 పెట్టి.. 3 నెలల స్టూడెంట్ రైలు పాస్ తీసుకున్నారు. ఇక ఉదయం కోయంబత్తూర్‌లో 5.50 గంటలకు ప్రారంభమై రైలు.. 6.25 వరకు ఎస్ఆర్ఎంవీకి చేరుకునేది. సాయంత్రం 6.10 గంటలకు ఎస్ఆర్ఎంవీ స్టేషన్లో ఎక్కి 6.45 గంటలకు తిరిగి కోయంబత్తూర్ చేరుకునేది. కానీ కాలేజీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుండగా.. కనీసం రోజుకు 6 గంటల సమయం వేలుమణికి దొరికేది.
ఇలా రోజుకు 6 గంటల సమయం దొరకడంతో.. దాన్ని వృథా చేయకుండా ఆయన.. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పైనే కూర్చుని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతూ ఉండేవారు. ఆ రోజుల్లో వేలుమణి తల్లి మాత్రమే వాళ్ల ఇంట్లో సంపాదించే వ్యక్తి. అది కూడా ఆమె రోజుకు రూ.3 సంపాదనతో మొత్తం కుటుంబాన్ని పోషించేవారు. తన కొడుకు కాలేజీ ఫీజు కోసం ఆమె తన 4 బంగారు గాజులను కూడా విక్రయించారు.
ఇక ఎస్ఆర్ఎంవీలో చదివిన 1000 రోజుల్లో తాను పడిన శ్రమ.. రోజుకు 6 గంటల చొప్పున మొత్తంగా 6 వేల గంటల ఏకాగ్రతే తనను బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ -బార్క్ లో శాస్త్రవేత్తగా మార్చాయని వేలుమణి సగర్వంగా చెబుతారు. ఇక 2015లో ఆయన తన భార్యను అదే రైల్వే ప్లాట్‌ఫారమ్‌కు తీసుకువెళ్లి.. ఆ ప్లాట్‌ఫారమే తనను శాస్త్రవేత్తను చేసిందని చూపించారు.
గత 10 ఏళ్ల కాలంలో వేలాది మందిని ఇంటర్వ్యూ చేసిన తన అనుభవంతో డాక్టర్ వేలుమణి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. కొంతమంది 20 ఏళ్లు పని చేసినా.. కేవలం 10 ఏళ్ల అనుభవాన్ని మాత్రమే పొందుతారని.. అలాంటివారిని ఆయన "బుడ్డా హో గయా" (ముసలివారయ్యారు) అని పిలుస్తారు. కానీ 10 ఏళ్లు పనిచేసి 20 ఏళ్ల జ్ఞానాన్ని సంపాదించేవారిని.. "బడా హో గయా" (గొప్పవారయ్యారు) అని పిలుస్తారు. అలాంటివారికే అవకాశాలు వస్తాయని డాక్టర్ వేలుమణి చెబుతారు.
జాబ్ అనేది కేవలం డబ్బును మాత్రమే ఇస్తుందని.. కానీ కెరీర్ జ్ఞానంతోపాటు అనుభవాన్ని కూడా అందిస్తుందని డాక్టర్ వేలుమణి చెబుతారు. 20 ఏళ్ల వయసులో పడే కష్టం.. 60 ఏళ్ల వయసులో కుటుంబాన్ని గౌరవంగా ఉంచుతుందని ఆయన బాగా విశ్వసిస్తారు. ఏదైనా త్వరగా వచ్చిందంటే అది ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తారు. ఏదైనా చాలా కష్టంగా అనిపిస్తోందంటే.. సరైన దారిలోనే వెళ్తున్నారని అర్థమని పేర్కొంటారు. అదృష్టవశాత్తూ తాను పేదవాడిని అని చెప్పే డాక్టర్ వేలుమణి గారి కథ, ఓర్పు, ఏకాగ్రత, క్రమశిక్షణ ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని నిరూపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa