ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ మరో ఎన్టీఆర్, ఎంజీఆర్ కాలేరు,,,తమిళనాడులో స్పష్టమైన తీర్పు

national |  Suryaa Desk  | Published : Fri, Jan 30, 2026, 08:12 PM

త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక తీర్పు రాబోతోందని వెటరన్ జర్నలిస్ట్, ది హిందూ పత్రిక డైరెక్టర్ ఎన్ రామ్ జోస్యం చెప్పారు. హంగ్ లేదా అధికార పంపకానికి ఎటువంటి ఆస్కారం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడుకు సంబంధించిన సమస్యలు, పోటీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు, సూపర్‌స్టార్ విజయ్ గురించి కూడా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్డీటీవీ తమిళనాడు కాన్‌క్లేవ్‌లో ఈ సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ... ‘‘ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీకి దగ్గరగా ఉంటాయని నేను అనుకోవడం లేదు.. భాగస్వామ్య పార్టీలతో ఎన్ని సీట్లు పంచుకుంటున్నారన్నదే అసలు విషయం’’ అని వ్యాఖ్యానించారు.


డీఎంకే పనితీరు ఎలా ఉండబోతుంది?


ఒక న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వేను రామ్ ఉటంకిస్తూ.. రాబోయే ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశారు. ‘ఇండియా టుడే అంచనా వేసినట్లుగా 12 శాతం పాయింట్ల ఆధిక్యం నిజమైతే కూటమికి 200కు పైగా సీట్లు వస్తాయి.. అందులో ఎక్కువ భాగం డీఎంకేకే దక్కుతాయి. అధికారంలో ఉండటంతో కొంత వ్యతిరేకత ఉన్నందున, 150కి పైగా స్థానాలను సాధించడం ప్రభుత్వానికి చాలా మంచి లక్ష్యం అవుతుంది’ అని ఆయన అన్నారు.


 ‘ఈ సర్వేలో ముఖ్యమంత్రి (స్టాలిన్) పార్టీ కంటే చాలా ఎక్కువ మార్కులు సాధించారు’ అని సీనియర్ జర్నలిస్ట్ నొక్కి చెప్పారు. ప్రధాని మోదీ ప్రజాదరణ బీజేపీ కంటే ఎలా ఎక్కువగా ఉంటుందనే దాంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అంత ఆశాజనకంగా కనిపించడంలేదని పేర్కొన్నారు. ‘ఆ పార్టీలో గందరగోళం, దాదాపు అస్తవ్యస్త పరిస్థితి చూసి నేను ఆశ్చర్యపోతున్నాను’ అని అన్నారు..


విజయ్ ప్రభావం ఎంత?


ఇక, తొలిసారి ఎన్నికల్లో పోటీచేస్తోన్న నటుడు విజయ్ పార్టీ, తమిళ వెట్రి కళగం (టీవీకే) గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కు తన అభిమానుల నుంచి ఎన్నికల్లో మద్దతు లభిస్తుంది కానీ ఇది అధికారం సాధించడానికి సరిపోదని చెప్పారు. ‘అభిమానుల నుంచి ఆయన (విజయ్)కు భారీ మద్దతు ఉంటుంది ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు.. మహిళల్లోనూ ఆయనకు ఆదరణ ఉంది.. విజయ్‌కాంత్ కంటే మెరుగ్గానే ఉంటారు కానీ ఇక్కడ ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ల దరిదాపుల్లోకి రాలేరు’ అని అన్నారు.


అయితే, అతడికి భారీగా అభిమానులు ఉన్నప్పటికీ, వెండితెర వెలుపల అతడి అదృష్టం కలిసిరాకపోవచ్చు.. ‘కేవలం కథల విషయంలోనే రాణించగలడు. వ్యవహారాలన్నీ నడిపిస్తున్న అతడి సలహాదారుల వద్ద గొప్ప ఆలోచనలు ఏమీ లేవు. ఆయనకు కేవలం ప్రజాదరణ మాత్రమే ఉంది. అభిమాన సంఘాలు తప్ప, క్షేత్ర స్థాయిలో అతడికి మద్దతుగా ప్రజలు లేరు’ అని ఎన్నికలకు ముందు టీవీకే ఎదుర్కోబోయే సవాళ్లను నొక్కి చెప్పారు.


తమిళనాడులో వారసత్వ రాజకీయాలేనా?


వారసత్వ రాజకీయాలు పెద్ద అంశమే కాదని ఎన్ రామ్ తేల్చిచెప్పారు. చాలా మంది రాజకీయ నాయకులు కొడుకులు, కుమార్తెలు అవకాశాలను అందుకుంటున్నారని చెప్పారు. ‘వారసత్వ రాజకీయాలు అంశమే కాదు... చాలా రాజకీయ పార్టీలలోకొడుకులు, కూతుళ్లు, బంధువులు ఎదగడానికి ఒక అవకాశాన్ని చూస్తారు.. దానిని నిజంగా ఆపలేరు. పశ్చిమ బెంగాల్‌తో సహా చాలా పార్టీలలో ఇది ఉంది. అసలు విషయం ఏమిటంటే, ఒక తీవ్రమైన పోటీలో మీరు సొంతంగా ఎన్నికల్లో గెలవగలరా? ఉదయనిధి స్టాలిన్ విషయానికొస్తే, అతను గెలవగలడని నేను అనుకుంటున్నాను’ అని ఆయన అన్నారు.


కాంగ్రెస్ సమస్య ఏంటి?


రాహుల్ గాంధీని తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే ధైర్యవంతుడైన నాయకుడిగా రామ్ అభివర్ణించారు. అయితే, నిలకడగా కృషి చేసే సామర్థ్యం ఆయనకు ఉందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ‘అకస్మాత్తుగా పార్టీలో నుంచే 'రాహుల్ జీ ఎక్కడ ఉన్నారు?’ అనే ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీకి అధిపతి అయిన అధ్యక్షుడు ఒకరు ఉండగా, అందరూ మరొకరి వైపు చూసే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయంలో ఆయన తన పార్టీ శ్రేయస్సు కోసం మరింత తీవ్రంగా నిబద్ధతతో పనిచేయాలని నేను భావిస్తున్నాను. ద్వంద్వ పాలన ఉండకూడదు’ అని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa