ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి పైఅధికారుల క్లాస్

national |  Suryaa Desk  | Published : Fri, Jan 30, 2026, 08:16 PM

ఒడిశా పోలీస్ శాఖలో ఒక డీఎస్పీ హెయిర్ స్టైల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న అధికారులు అత్యంత క్రమశిక్షణతో, నిరాడంబరంగా కనిపిస్తారు. కానీ జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్‌లో పని చేస్తున్న 49 ఏళ్ల డీఎస్పీ రష్మీ రంజన్ దాస్ మాత్రం అందుకు భిన్నంగా తన జుట్టుకు ముదురు ఎరుపు రంగువేసుకుని విధులకు హాజరు అవుతున్నారు. ఈ 'రెడ్ హెయిర్' లుక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీస్ బాసులు ఆయనకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.


వైరల్ ఫోటోలు, నెటిజన్ల ట్రోలింగ్..!


డీఎస్పీ రష్మీ రంజన్ దాస్ యూనిఫామ్‌లో ఉన్న ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఆయన జుట్టు రంగును చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. "పోలీస్ అధికారికి ఇలాంటి ఫ్యాషన్లు అవసరమా?" అని కొందరు ప్రశ్నించగా, మరికొందరు మీమ్స్‌తో విరుచుకుపడ్డారు. ఒక యూనిఫామ్ ధరించిన వ్యక్తికి ఉండాల్సిన గంభీరతను ఈ హెయిర్ కలర్ దెబ్బతీస్తోందని, వృత్తిపరమైన క్రమశిక్షణ ఎక్కడ ఉందని విమర్శలు గుప్పించారు.


ఈ వ్యవహారం పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరడంతో ఐజీ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ సీరియస్ అయ్యారు. గురువారం ఆయన డీఎస్పీ దాస్‌కు అధికారికంగా హెచ్చరికలు జారీ చేశారు. "పోలీస్ బలగాల్లో ఉన్న ఎవరైనా యూనిఫామ్‌ను గౌరవించాలి. క్రమశిక్షణ, పబ్లిక్ డెకోరమ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి" అని ఐజీ స్పష్టం చేశారు. వెంటనే ఆ ఎరుపు రంగును తొలగించి, సహజ సిద్ధమైన రంగులోకి జుట్టును మార్చుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.


నేరగాళ్లకు సింహస్వప్నం.. కానీ?


స్థానికంగా రష్మీ రంజన్ దాస్‌కు మంచి పేరుంది. అండర్ వరల్డ్ నేరగాళ్లను ఏరిపారేయడంలో ఆయన దిట్ట అని, సమర్థవంతమైన అధికారి అని ప్రజలు చెబుతుంటారు. "ఒక వ్యక్తి సామర్థ్యాన్ని వారి హెయిర్ స్టైల్‌తో కొలవలేం" అని కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే తోటి సహోద్యోగులు మాత్రం ఆయనకు గతంలోనే పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. జుట్టుకు నలుపు రంగు వేసుకోవాలని సూచించినప్పటికీ.. ఆయన పట్టించుకోలేదని తెలుస్తోంది.


పోలీస్ మాన్యువల్ ఏం చెబుతోంది?


రిటైర్డ్ పోలీస్ అధికారులు చెబుతున్న ప్రకారం.. పోలీస్ మాన్యువల్‌లో ఫలానా హెయిర్ స్టైల్ ఉండాలని ఖచ్చితంగా రాసి లేకపోయినప్పటికీ.. అధికారులు నిరాడంబరంగా ఉండాలని నిబంధనలు ఉన్నాయి. ఖాకీ డ్రెస్ ధరించినప్పుడు అది అధికారానికి, బాధ్యతకు చిహ్నంగా ఉండాలి తప్ప, గ్లామర్ ప్రదర్శనకు వేదిక కాకూడదని వారు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతానికి ఈ వివాదంపై స్పందించేందుకు డీఎస్పీ నిరాకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa