ఎవరైనా పల్లెటూరు నుంచి నగరానికి కొత్తగా వచ్చారనిపిస్తే.. గమ్యస్థానం చేర్చడానికి కొందరు ఆటోడ్రైవర్లు వారి దగ్గర నుంచి అదనంగా ఛార్జీ వసూలు చేస్తుంటారు కదా. కొందరు ఆటో డ్రైవర్లు అయితే ఊరంతా తిప్పి, చివరికి ఎక్కిన చోటే దింపేసి.. భారీగా డబ్బులు లాగేస్తుంటారు. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 786 సినిమాలోనూ ఇలాంటి సీన్ ఒకటి ఉంది. అచ్చం ఇలాగే.. అమెరికా నుంచి వచ్చిన ఓ మహిళను ముంబై క్యాబ్ వాలా ఇటీవల మోసం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న హోటల్ దగ్గర దింపడానికి.. అమెరికన్ టూరిస్ట్ దగ్గర్నుంచి ఓ క్యాబ్ డ్రైవర్ ఏకంగా రూ.18 వేలు (200 డాలర్లు) వసూలు చేశాడు. అయితే ఆ పర్యాటకురాలు సోషల్ మీడియా ద్వారా తనకు జరిగిన మోసాన్ని బయటపెట్టడంతో అరెస్ట్ అయ్యాడు.
అసలేం జరిగిందంటే?
అర్జెంటీనా అరియా అనే అమెరికన్ మహిళ జనవరి 12న ముంబై నగరానికి వచ్చింది. ఎయిర్పోర్ట్ సమీపంలోని హిల్టన్ హోటల్‌కు వెళ్లేందుకు ఆమె ఓ క్యాబ్‌ను పిలిచింది. ఈక్రమంలోనే 50 ఏళ్ల వయసు కల్గిన దేశ్రాజ్ యాదవ్ అనే డ్రైవర్ రాదా.. అతడి క్యాబ్ ఎక్కింది. నిజానికి విమానాశ్రయం నుంచి ఆ హోటల్ కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంది. కానీ ఆ డ్రైవర్ తన అనుచరుడితో కలిసి ఆమెను సుమారు 20 నిమిషాల పాటు అంధేరీ ప్రాంతమంతా తిప్పి.. చివరకు హోటల్ వద్ద దించి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడు. దీంతో ఆ పర్యాటకురాలు చేసేది లేక రూ.18 వేలు చెల్లించింది.
ఎక్స్ వేదికగా పోస్టు చేయడంతో.. విషయం వెలుగులోకి!
క్యాబ్ డ్రైవర్ ఏకంగా 200 డాలర్లు డిమాండ్ చేయడంతో అమెరికన్ మహిళ ఆశ్చర్యపోయింది. అయినా సరే ఇప్పుడు అతడితో ఎందుకు గొడవ అని డబ్బులు ఇచ్చేసింది. అయితే ఎందుకైనా మంచిదని ఆ క్యాబ్ నంబర్ ప్లేట్ కనిపించేలా ఓ ఫోటో తీసుకుంది. హోటల్‌కు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యాక.. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన అర్జెంటీనా.. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్‌కు ఎంత దూరముందో చూసింది. విమానాశ్రయం నుంచి హోటల్ కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. అంటే నడవగలిగే దూరమే. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టింది.
అందులో క్యాబ్ నంబర్ సహా తన దారుణ అనుభవాన్ని రాసుకొచ్చింది. 400 మీటర్ల దూరానికే 18 వేల రూపాయలు తీసుకోవడంతో.. ఈ పోస్టుకు అతి తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వైరల్‌గా మారిన ఈ పోస్టు ముంబై పోలీసులు కంట్లో పడింది. ఆ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆధారంగా.. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆ మహిళ అప్పటికే అమెరికా వెళ్లిపోయినప్పటికీ.. పోలీసులు మాత్రం క్యాబ్ డ్రైవర్‌ను వదల్లేదు. సీసీ టీవీలు, హోటల్ రికార్డుల ఆధారంగా డ్రైవర్ దేశ్‌రాజ్‌ను మూడు గంటల్లోనే పట్టుకున్నారు. నిందితుడి లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆర్టీఓను పోలీసులు కోరారు.
వరుసగా జరుగుతున్న దోపిడీలు..
ముంబై ఎయిర్పోర్ట్ వద్ద ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2024 డిసెంబర్ నెలలో 10 నిమిషాల ప్రయాణానికి రూ. 2,800 వసూలు చేసినందుకు గాను.. వినోద్ గోస్వామి అనే డ్రైవర్ అరెస్ట్ అయ్యాడు. ఇదే నెలలో అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థిని బెదిరించి రితేష్ కడమ్ అనే ఆటో డ్రైవర్ రూ. 3,500 వసూలు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పర్యాటకులను గైడ్ చేసే హెల్ప్ డెస్క్‌లు లేకపోవడం, సైన్ బోర్డులు సరిగ్గా లేకపోవడమే ఈ మోసాలకు కారణమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. క్యాబ్‌ల లోపల, బయట పోలీసు ఫిర్యాదు నంబర్లు కనిపించే ఏర్పాట్లు చేయాలని మాజీ ఐపీఎస్ అధికారి వైపీ సింగ్ సూచించారు. పర్యాటకులు తమకు ఇలాంటి అనుభవం ఎదురైనప్పుడు వెంటనే హోటల్ సిబ్బందికి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. 'అతిథి దేవో భవ' అన్న నినాదానికి తూట్లు పొడిచే ఇటువంటి కేటుగాళ్లపై కఠిన చట్టాలు తీసుకురావాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa