ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.36 వేల కోట్లకే 30 అపాచీ హెలికాప్టర్‌లు

international |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 08:50 PM

అగ్రరాజ్యం అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు భారీ రక్షణ సాయాన్ని ప్రకటించింది. ముఖ్యంగా 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.36 వేల కోట్లు) విలువైన 30 అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లను అందించే ఒప్పందానికి ఓకే చెప్పింది. ఈ భారీ ఒప్పందంతోపాటు ఇతర యుద్ధ పరికాలను కూడా అందించాలని ట్రంప్ నిర్ణయించారు. గాజాలో ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలోనే.. అమెరికా మొత్తంగా 6.7 బిలియన్ డాలర్ల భారీ ఆయుధ ప్యాకేజీ ఇజ్రాయెల్‌కు అందబోతుండడంతో.. అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇజ్రాయెల్ భద్రతే లక్ష్యంగా అమెరికా ఈ శక్తిమంతమైన 30 యుద్ధ హెలికాప్టర్లతో పాటు వీటికి సంబంధించిన అనుబంధ పరికరాలను అందించనుంది. ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ సామర్థ్యాన్ని నిరంతరం సిద్ధంగా ఉంచుకోవడంలో సహాయపడటం.. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అత్యంత కీలకమని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అత్యాధునిక హెలికాప్టర్లు ఇజ్రాయెల్ వాయుసేన దాడి సామర్థ్యాన్ని అసాధారణ రీతిలో పెంచనున్నాయి.


తాజా ఒప్పందంలో కేవలం హెలికాప్టర్లు మాత్రమే కాకుండా 1.8 బిలియన్ డాలర్ల విలువైన 'జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్స్'ను విక్రయిస్తున్నారు. అమెరికా ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్‌కు బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని అందజేస్తూ వస్తోంది. అయితే తాజాగా ప్రకటించిన ప్యాకేజీలో విక్రయాలతో పాటు అదనపు రక్షణ సామగ్రి కూడా ఉండటం గమనార్హం. ఇజ్రాయెల్‌కు తిరుగులేని మద్దతు ఇస్తామని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ మరింత వేగవంతం అయింది.


గాజాలో కాల్పుల విరమణ.. హమాస్ నిరాయుధీకరణ


అక్టోబర్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ప్రస్తుతం అమలులో ఉంది. రెండేళ్ల పాటు సాగిన భీకర యుద్ధం ఈ ఒప్పందంతో కొంత సద్దుమణిగింది. అయితే ప్రస్తుత కాల్పుల విరమణ రెండో దశలో ఉందని, హమాస్‌ను పూర్తిగా నిరాయుధీకరించడమే తమ తదుపరి లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌కు అందుతున్న ఈ భారీ ఆయుధ సంపత్తి ప్రాంతీయ సమతుల్యతపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది.


2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1,221 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు సామాన్య పౌరులే కావడం గమనార్హం. దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ గాజాపై చేపట్టిన సైనిక చర్యలో ఇప్పటి వరకు కనీసం 71,667 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ రక్తపాతానికి ముగింపు పలికేందుకు కాల్పుల విరమణ కుదిరినప్పటికీ.. ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశగా అమెరికాతో ఈ భారీ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa