తమిళనాడులో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఖాళీ మద్యం బాటిళ్ల కొనుగోలు (బై-బ్యాక్) పథకం చెన్నైలో ఈ వారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. గతంలో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవడంతో ఈ పథకాన్ని నగరంలో తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, పకడ్బందీ ఏర్పాట్లతో దశలవారీగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) నిర్ణయించింది.ఈ పథకం కింద, మద్యం కొనుగోలు చేసేటప్పుడు ప్రతి బాటిల్‌పై కస్టమర్ల నుంచి అదనంగా రూ.10 వసూలు చేస్తారు. ఆ ఖాళీ బాటిల్‌ను తిరిగి నిర్దేశిత టాస్మాక్ దుకాణంలో లేదా కలెక్షన్ పాయింట్‌లో అప్పగిస్తే, ఆ రూ.10 మొత్తాన్ని వినియోగదారులకు వాపసు ఇస్తారు. మొదట కొండ ప్రాంతాల్లో విసిరేసిన మద్యం సీసాల వల్ల ఏనుగులు వంటి వన్యప్రాణులకు గాయాలవుతున్నాయని భావించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa