టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు భారత జట్టు తమ ఏకైక వార్మ్ అప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నవి ముంబైలో ఇవాళ జరగనున్న ఈ మ్యాచ్, టీమిండియాకు సాధారణ ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే కాదు.. కొందరు ఆటగాళ్లకు ఇది కీలక పరీక్షగా మారింది. ముఖ్యంగా సంజూ శాంసన్‌కు ఇది చావో రేవో అన్న స్థాయిలో మారింది.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. మ్యాచ్ విన్నర్లతో నిండిన ఈ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయినప్పటికీ, వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు కొన్ని కీలక స్థానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అందులో ముందుగా మాట్లాడుకోవాల్సింది సంజూ శాంసన్ ప్రదర్శనే.
న్యూజిలాండ్ సిరీస్‌లో సంజూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 46 పరుగులే చేయగలిగాడు. మూడు సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. అన్ని మ్యాచ్‌ల్లో ఆడిన ఓపెనర్‌గా ఇంత తక్కువ స్కోరు నమోదు కావడం అతడికి ప్రతికూలంగా మారింది.
ఇదే సమయంలో ఇషాన్ కిషన్ తన ప్రదర్శనతో సెలక్షన్ పోరును పూర్తిగా మలుపు తిప్పాడు. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన కిషన్, న్యూజిలాండ్ సిరీస్‌లో 215 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 50కు పైగా సగటు, 230కి మించిన స్ట్రైక్ రేట్‌తో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ కూడా బాదాడు. దీంతో ఓపెనింగ్ స్థానానికి పోటీ మరింత పెరిగింది.
సంజూ కెరీర్లో సెలక్షన్ సమస్యలు కొత్తవి కావు. గత కొన్నేళ్లుగా అతడు స్థిరమైన స్థానం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఆసియా కప్ సమయంలో ఓపెనర్‌గా ఉన్న సంజూను మిడిల్ ఆర్డర్‌కు మార్చడం, తర్వాత మళ్లీ ఓపెనర్‌గా తీసుకురావడం వంటి మార్పులు అతడి ఆటపై ప్రభావం చూపాయి. స్థిరత్వం లేకపోవడం వల్ల అతడు సరైన రిథమ్‌లోకి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
న్యూజిలాండ్ సిరీస్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇషాన్ కిషన్ ప్రదర్శనను ప్రశంసించడం సెలక్షన్ చిత్రాన్ని మరింత స్పష్టంగా చూపించింది. టీమ్ మేనేజ్మెంట్ ప్రస్తుతం ఫామ్‌ను ప్రధానంగా పరిగణలోకి తీసుకునే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు సంజూకు మిగిలింది ఈ ఒక్క అవకాశం మాత్రమే. దక్షిణాఫ్రికాతో జరిగే వార్మప్ మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడితే, తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. కనీసం అర్ధ సెంచరీ అయినా సాధిస్తే, సెలెక్టర్ల నమ్మకాన్ని తిరిగి పొందగలడు. లేకపోతే, వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌ల్లో అతడికి బెంచ్‌కే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa