తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై మాజీ ఈవో, రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ఆయన నిన్న స్పందిస్తూ టీటీడీలో తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. తాను ఒక సామాన్య భక్తుడిగా కోరుతున్నానని అన్నారు. తప్పు చేసినవారు అంగప్రదక్షిణ చేస్తారో, లేదంటే కోనేటిలో మునిగి ప్రాయశ్చిత్తం చేసుకుంటారో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినట్లు 2024లో సీఎం చంద్రబాబు తనకు చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐతో పాటు సిట్ కూడా దర్యాప్తు చేపట్టిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఇది కేవలం తప్పిదం మాత్రమే కాదని.. అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడినవారు తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ పాపాన్ని ఇప్పటికైనా రాజకీయ కోణంలో చూడొద్దని నిందితులకు సూచించారు. చేసిన తప్పులను ఒప్పుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో పని చేసే వారిలో చిత్తశుద్ధి లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన ప్రసాదంలో రసాయనాలు కలిపి మహాపాపం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారంలో అసలు తప్పే జరగలేదన్నట్లుగా కొందరు మాట్లాడటం విచారకరమని వ్యాఖ్యానించారు. తప్పు చేసినవారిలో ఇప్పటికీ చిత్తశుద్ధి రావడం లేదని, శిక్షలు పడవనే ధైర్యంతో కొందరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదం తయారీ కోసం రోజుకు 13 నుంచి 18 వేల కిలోల నెయ్యి వినియోగిస్తారని ఆయన గుర్తు చేస్తూ, స్వామివారి పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే నెయ్యిని అన్నప్రసాదాల్లోనూ ఉపయోగిస్తారని చెప్పారు. నెయ్యి నాణ్యత లేదని తెలిసినప్పుడే ట్యాంకర్లను ప్రభుత్వం ఆపివేయాల్సింది కాదా అని ఆయన ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa