ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ లోని ఆ ప్రాంతాన్ని భారత్‌లో కలుపుతూ అమెరికా కొత్త మ్యాప్

national |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 08:04 PM

మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై అమెరికా, భారత్‌లు ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిన వేళ.. అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టేడ్ర్ డీల్‌పై ట్రంప్ యంత్రాంగం రూపొందించిన ఇండియా మ్యాప్‌ చర్చనీయాంశంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా మొత్తం జమ్మూ కశ్మీర్‌ను భారత్‌‌ భూభాగంగా పేర్కొంటూ అమెరికా కొత్త మ్యాప్‌ విడుదల చేసింది. అంతేకాదు, చైనా తన భూభాగంగా వాదించే ఆక్సాయ్ చిన్‌ను కూడా ఇందులో చేర్చింది. కానీ, భారత ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ధ్రువీకరించడానికి అమెరికా ఆమోదం అవసరం లేదు. కశ్మీర్ మొత్తం ఎప్పటికీ తమదేనని తురచూ భారత్ స్పష్టం చేస్తూనే ఉంది.


అయినప్పటికీ, ఇది అమెరికా గత వైఖరికి భిన్నంగా ఉండటం గమనార్హం. అమెరికా నాయకత్వం భారత మ్యాప్‌నకు అనుగుణంగా ఉందని ఉద్దేశపూర్వకంగా లేదా యాదృచ్ఛికంగా పాక్‌కు బలమైన దౌత్య సంకేతాన్ని పంపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో, అమెరికా విడుదల చేసిన మ్యాప్‌లు పీఓకేపై పాకిస్థాన్ వాదనలకు అనుగుణంగా ఉండేవి. కానీ, ట్రంప్ యంత్రాంగం విడుదల చేసిన తాజా మ్యాప్ పాక్ వాదనలను తప్పుబడుతోంది. రెండు రోజుల కిందట పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కశ్మీర్‌పై కారుకూతలు కూసిన నేపథ్యంలో అమెరికా మ్యాప్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ ప్రతీకార సుంకాలతో దాదాపు ఏడాదిగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలకు భారత్, అమెరికా తెరదించుతూ వాణిజ్య ఒప్పందంపై అంగీకారానికి వచ్చాయి. దీంతో భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను 18 శాతానికి ట్రంప్ తగ్గించారు. ఆసియా దేశాలలో ఇదే అత్యల్పం కావడం చెప్పుకోదగ్గ అంశం.


సరిహద్దు సంఘర్షణల్లో ఉన్న భారత్, పాకిస్థాన్ విషయంలో జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రారంభించిన, తర్వాతి అమెరికా అధ్యక్షులు అనుసరించిన విదేశాంగ విధానానికి భిన్నమైన విధానాన్ని ట్రంప్ అవలంభిస్తున్నారు. అమెరికా రూపొందించిన తాజా మ్యాప్‌లో లడఖ్‌లోని ఆక్సాయ్ చిన్‌‌ను కూడా భారత్‌ భూభాగంగా పేర్కొంది. ఈ ప్రాంతం తమదేనంటూ చైనా తరుచూ వాదిస్తుండగా.. భారత్ ఆ వాదనలను కొట్టిపారేస్తోంది.


అమెరికా సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు ఉపయోగించే మ్యాప్‌లలో భారత సరిహద్దులు ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ , అరుణాచల్ ప్రదేశ్‌లను తప్పుగా చూపుడాన్ని న్యూఢిల్లీ నిరంతరం అభ్యంతర తెలుపుతూనే ఉంది. అమెరికా తాజా చర్య భారత్ దీర్ఘకాల ఆందోళనను చివరకు పరిగణనలోకి తీసుకున్నట్టయ్యింది. ఈ పరిణామాలపై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.


అంతేకాదు, ఇది పాకిస్థాన్‌‌కు ,ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌, వాషింగ్టన్ పర్యటనల ప్రచారానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని పేర్కొంటున్నారు. గత ఆరు నెలలుగా అమెరికాతో పాకిస్థాన్ దౌత్యం పతాకస్థాయికి చేరింది. ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మూడుసార్లు అమెరికాకు వెళ్లొచ్చి, రెండుసార్లు ట్రంప్‌తో సమావేశమయ్యారు. గతేడాది జూన్‌లో తొలిసారి వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను పాక్ ఆర్మీ చీఫ్ కలుసుకున్నారు. దేశ నాయకత్వం లేకుండా పాక్ ఆర్మీ చీఫ్‌తో అమెరికా అధ్యక్షుడు నేరుగా భేటీ కావడం అదే మొదటిసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa