ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌కు హైటెక్ సిటీలా దేశానికి క్వాంటమ్ సెంటర్ గేమ్ ఛేంజర్ అవుతుందని ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 08:06 PM

అమరావతికో ఆంధ్రప్రదేశ్‌కో సంబంధించిన రోజు కాదు. యావత్ భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రక దినం. గతంలో మనం వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాలను అందిపుచ్చుకోలేకపోయాం. కానీ, కమ్యూనికేషన్, ఐటీ విప్లవంలో వేగంగా అడుగులు వేశాం. ఇప్పుడు ప్రపంచం ముందున్న క్వాంటమ్ విప్లవంలో మనం అనుసరించడం కాదు, ఏకంగా నాయకత్వం వహించబోతున్నాం. ఆ మహాయజ్ఞానికి అమరావతి నుంచే పునాది వేస్తున్నాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి భవిష్యత్తును, తద్వారా దేశ సాంకేతిక ప్రగతిని నిర్దేశించే 'క్వాంటమ్ వ్యాలీ' భవన నిర్మాణానికి శనివారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు తన దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు.ఆనాటి రోజులను గుర్తు చేసుకున్న చంద్రబాబు 1995లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు బిల్ గేట్స్ ఇంటర్నెట్‌ను ఆవిష్కరించారు. అప్పుడు దాని ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్రాన్ని ఆ దిశగా నడిపించా. మాజీ ప్రధాని వాజ్‌పేయి గారు టెలికమ్యూనికేషన్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం, నేను హైటెక్ సిటీని ప్రారంభించడం దేశ ఐటీ రంగంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచాయి. ఆనాడు వాజ్‌పేయి గారు హైటెక్ సిటీని ప్రారంభిస్తే, నేడు క్వాంటమ్ వ్యాలీకి ఇక్కడ పునాది పడింది. ఇది దేశానికే మరో గేమ్ ఛేంజర్ అవుతుంది. ఈ చరిత్రలో మనమందరం భాగస్వాములం" అని ఉద్వేగంగా ప్రసంగించారు.తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకోనుంది. ఇది కేవలం ఒక భవనం కాదు, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రక్షణ, ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా మారనుంది. వచ్చే 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు సీఎం స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశంలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతికి తీసుకురావాలి. ఒకటి రెండు నెలల్లో ఒప్పందాలు పూర్తిచేసి, ఈ ఏడాది చివరికల్లా తొలి క్వాంటమ్ కంప్యూటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 14 నాటికి మరో రెండు క్వాంటమ్ సెంటర్లను కూడా ప్రారంభిస్తాం అని లక్ష్యాలను నిర్దేశించారు. 2030 నాటికి రాష్ట్రంలో 2.5 లక్షల మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయాలనే బృహత్ ప్రణాళికను ఆయన వివరించారు.అమరావతిని ప్రపంచ పటంలో నిలపాలన్న తన సంకల్పానికి బలం చేకూరుస్తూ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 16న అమరావతికి రానున్నట్లు చంద్రబాబు ప్రకటించడం సభలో హర్షాతిరేకాలు రేపింది. దేశంలోని ఐటీ నిపుణుల్లో 35 శాతం మంది తెలుగువారేనని గుర్తు చేస్తూ, వారి ప్రతిభను రాష్ట్ర భవిష్యత్తు కోసం వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మంత్రులు నారాయణ, కందుల దుర్గేశ్, ఐఐటీ, టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ సంస్థల ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శంకుస్థాపన, ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ సాంకేతిక హబ్‌గా మార్చే ప్రయాణంలో ఒక మైలురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa