ఉద్యోగుల హక్కుల విషయంలో కేరళ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు.. ఆ లేఖను ఆమోదించకుండా అడ్డుకునే హక్కు యాజమాన్యాలకు లేదని కోర్టు స్పష్టం చేసింది. రాజీనామాను ఆమోదించకపోవడం అంటే ఆ ఉద్యోగిని ఒక కట్టు బానిసలా చూడటమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ తీర్పు కార్పొరేట్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా నిలుస్తోంది..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రస్తావన..
న్యాయమూర్తి తన తీర్పులో భారత రాజ్యాంగంలోని 23వ అధికరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో వెట్టిబానిసత్వాన్ని లేదా బలవంతపు చాకిరీని రాజ్యాంగం పూర్తిగా నిషేధించిందని గుర్తు చేశారు. ఒక ఉద్యోగి తన ఇష్ట పూర్వకంగా సంస్థ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఒప్పందంలో బలమైన చట్టపరమైన షరతులు ఉంటే తప్ప, వారిని బలవంతంగా కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ఉద్ఘాటించింది.
అసలీ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఏంటంటే?
ఈ కేసులో పిటిషనర్ ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సెక్రటరీగా పని చేస్తున్నారు. 2020లో ఆయన తండ్రి మరణించగా.. అప్పటి నుంచి ఆయన తల్లి తీవ్రమైన మానసిక, నాడీ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. అయితే తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నందున.. తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇంటికి దగ్గరగా ఉండే మరో పనిని వెతుక్కోవాలని సదరు పిటిషనర్ నిర్ణయించుకున్నారు.
ఈక్రమంలనే ఆయన వెంటనే రాజీనామా పత్రాన్ని కూడా కంపెనీకి సమర్పించారు. అయితే సదరు యాజమాన్యం ఆర్థిక కారణాలు, పని ఒత్తిడిని సాకుగా చూపుతూ ఆయన రాజీనామాను తిరస్కరించింది. అంతేకాకుండా 2022 అక్టోబర్ నుంచి ఆయనకు జీతం చెల్లించడం కూడా నిలిపివేసింది. రాజీనామా ఆమోదం పొందితేనే ఆయన మరొక సంస్థలో చేరే అవకాశం ఉండటంతో.. పిటిషనర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ వాదనలను విన్న హైకోర్టు.. సదరు సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆదేశించింది. నిలిపివేసిన జీతం బకాయిలు, గ్రాట్యుటీ, పీఎఫ్ వంటి అన్ని ప్రయోజనాలను లెక్కగట్టి, రెండు నెలల వ్యవధిలోపు అతడికి చెల్లించాలని స్పష్టం చేసింది. ఉద్యోగ నియామక ఒప్పందంలో నిష్క్రమణకు సంబంధించి ఎలాంటి తీవ్రమైన చట్టపరమైన అడ్డంకులు లేనప్పుడు.. యాజమాన్యం మొండిగా వ్యవహరించకూడదని హితవు పలికింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa