ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో భారీ సుడిగాలి.. భయపడిపోయిన యువకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 09:58 PM

అనకాపల్లి జిల్లాలో సుడిగాలి భయాందోళనకు కారణమైంది. అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం సుడిగాలి దుమారం రేపింది. సుమారు అరగంట పాటు బీభత్సం సృష్టించింది. సోమవారం ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతున్న సమయంలో.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. సుడిగాలి రావటంతో యువకులు కంగారుపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారుగా వంద అడుగుల ఎత్తులో సుడులు తిరుగుతూ, ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లుగా తీవ్రంగా గాలి వీయటంతో స్థానికులు కూడా కంగారుపడిపోయారు. గతంలో ఇలాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదంటున్నారు.


మరోవైపు దీనినే డస్ట్ డెవిల్, టోర్నడో, ట్విస్టర్ అని వివిధ పేర్లతో కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా అమెరికాలో ఇలాంటివి చోటుచేసుకుంటూ ఉంటాయి. అయితే అమెరికాలో విరుచుకుపడే టోర్నడోలు భారీగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సుడిగాలులు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. క్యుములోనింబస్‌ మేఘాలు, అలాగే మేఘాల కింద ఉండే ధూళి వంటి వ్యర్థాల నుంచి టోర్నడోలు పుట్టుకొస్తాయని చెప్తున్నారు. ఏర్పడిన చోటు నుంచి వందల కిలోమీటర్ల వేగంతో.. కొన్ని కిలోమీటర్ల దూరం ఇవి ప్రయాణిస్తాయని.. ఆ మార్గంలో విధ్వంసం సృష్టిస్తాయని వివరిస్తున్నారు.


అసాధారణ స్థాయిలో వేడి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి సుడిగాలులు ఏర్పడుతాయని నిపుణులు చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు తేమతో కూడిన గాలి వేడెక్కి పైకి లేస్తుందని వివరిస్తున్నారు. శీతాకాలంలో గాలిలో వేడి, తేమ శాతం పెద్దగా ఉండదు కావున టోర్నడోలు వచ్చే అవకాశం తక్కువని.. ఎండాకాలంలో ఇవి ఏర్పడుతుంటాయని చెప్తున్నారు. మరోవైపు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఎక్కువగా టోర్నడోలు సంభవిస్తుంటాయి. ఇక్కడ ఏటా 140 వరకూ టోర్నడోలు ఏర్పడుతుంటాయని అంచనా. అమెరికా తర్వతా కెనడాలో ఎక్కువగా టోర్నడోలు సంభవిస్తూ ఉంటాయి. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్, తూర్పు చైనా ప్రాంతాల్లోనూ ఇలాంటివి చూస్తుంటాం. అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లోనూ ఇవి ఏర్పడుతుంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa