ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె వర్సెస్ సోదరి.. పైచేయి ఎవరిది,,,ఉత్తర కొరియాలో వారసత్వ యుద్ధం

international |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 11:58 PM

ప్రపంచంలోనే అత్యంత రహస్య దేశమైన ఉత్తర కొరియాలో ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన కుటుంబ పోరుకు తెరలేవబోతోంది. ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు ఏని దేశ తదుపరి పాలకురాలిగా దాదాపు ఖరారు చేసినట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థ సంచలన నివేదిక వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం కిమ్ సోదరి, దేశంలోనే రెండో అత్యంత శక్తివంతమైన మహిళగా పేరున్న కిమ్ యో జోంగ్‌‌కు ఏమాత్రం నచ్చలేదని చెప్పారు. దీంతో కిమ్ జు ఏకు, కిమ్ కుమార్తెకు మధ్య భవిష్యత్తులో తీవ్రమైన అధికార పోరుకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


వారసురాలిగా ముహూర్తం ఖరారు?


ఈ నెలాఖరులో జరగనున్న ఉత్తర కొరియా 'వర్కర్స్ పార్టీ కాంగ్రెస్' సమావేశంపై యావత్ ప్రపంచం కన్నేసింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ కీలక సమావేశంలో కిమ్ 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు ఏను అధికారికంగా వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే 2022లో మొదటిసారి క్షిపణి ప్రయోగం వద్ద కనిపించిన జు ఏ.. ఇప్పుడు తండ్రితో కలిసి సైనిక పరేడ్‌లు, ఫ్యాక్టరీ తనిఖీలే కాకుండా.. గత సెప్టెంబర్‌లో బీజింగ్ పర్యటనకు కూడా వెళ్లివచ్చారు. కేవలం ఉత్సవ విగ్రహంలా కాకుండా.. కొన్ని ప్రభుత్వ విధానాలపై కూడా ఆమె తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.


అత్త కిమ్ యో జోంగ్.. ఒక పవర్‌ఫుల్ సవాల్!


ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న కిమ్ యో జోంగ్.. కిమ్ జోంగ్ ఉన్ నీడలా ఉంటూ దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. పీఠం కోసం ఆమె తన కోరికను చంపుకుంటుందా అంటే అనుమానమేనని మాజీ నిఘా అధికారి రా జోంగ్ యిల్ అభిప్రాయపడ్డారు. ఆమెకు సైన్యంలో, రాజకీయ వర్గాల్లో బలమైన పట్టు ఉందన్నారు. ఒకవేళ తనకు అవకాశం ఉందని భావిస్తే.. ఆమె కచ్చితంగా తన సొంత ‘పొలిటికల్ ప్రాజెక్ట్’ను అమలు చేస్తారని ఆయన హెచ్చరించారు.


రక్త చరిత్ర పునరావృతమవుతుందా?


ఉత్తర కొరియాలో అధికారం కోసం సొంత కుటుంబ సభ్యులనే నిర్దాక్షిణ్యంగా అంతం చేసిన దాఖలాలు ఉన్నాయి. 2013లో కిమ్ తన మేనమామ, గురువు అయిన జాంగ్ సాంగ్ థేక్‌ను ‘ద్రోహి’గా ముద్రవేసి కాల్చి చంపించారు. అలాగే 2017లో మలేషియా విమానాశ్రయంలో కిమ్ సవతి అన్న కిమ్ జోంగ్ నామ్‌ను రసాయన దాడితో కిమ్ మనుషులు అంతం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు అత్తా, కోడలి మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందా, ఏం జరగనుందో చూడాలి.


అణు క్షిపణుల మధ్య వారసత్వం


ప్రస్తుతం ఉత్తర కొరియా సుమారు 50 నుంచి 90 వరకు అణు వార్‌హెడ్లను కలిగి ఉందని అంచనా. ఇలాంటి శక్తివంతమైన దేశాన్ని 13 ఏళ్ల బాలికకు అప్పగిస్తే.. సైనిక శ్రేణులు ఎలా స్పందిస్తాయనేది మిస్టరీగా మారింది. ఈ నెలాఖరులో జరిగే సమావేశం కిమ్ జు ఏ భవిష్యత్తును మాత్రమే కాదు, ఉత్తర కొరియా స్థిరత్వాన్ని కూడా నిర్ణయించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa