రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతున్నారని వైయస్ఆర్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని హరిభక్తులను మానసిక క్షోభకు గురిచేస్తూ, నిత్యం ఏదో ఒక అసత్యాన్ని ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబు తీరును మాజీ మంత్రి ఆక్షేపించారు. శ్రీవారి ప్రసాదాన్ని వేలెత్తి చూపిన చంద్రబాబు తీరుతో, తిరిగి నాలుగు వేళ్లు ఆయన తప్పులనే చూపిస్తున్నాయని స్పష్టం చేశారు. గతంలో ఎన్టీఆర్ గారిపై దుష్ప్రచారం చేసినట్లే, ఇప్పుడు వైయస్ జగన్‌ను కూడా ప్రజల నుంచి దూరం చేసేందుకు భగవంతుడిని కూడా వాడుకుంటున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు అవశేషాలు లేవని ఎన్‌డిఆర్‌ఐ, ఎన్‌డిడిబి ల్యాబ్‌లతో పాటు సుప్రీంకోర్టు నియమించిన ’సిట్’ కూడా తన ఛార్జిషీట్‌లో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘నిజం బయటపడిన తర్వాత బాధ్యత గల ముఖ్యమంత్రిగా భక్తులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. ఇప్పుడు లడ్డూలో బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్ కలిపారంటూ మరిన్ని అపవిత్ర మాటలు మాట్లాడటం చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం‘ అని ధ్వజమెత్తారు. భగవంతుడి మీద వేసిన ఈ నింద నుండి చంద్రబాబు తప్పించుకోలేరని, తప్పుడు ప్రచారంతో భక్తులను భయపెట్టే మీ ఆశలు నెరవేరవని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa