అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చి ఫెలోషిప్‌కు అర్హత కల్పించే యూజీసీ నెట్ పరీక్ష నిర్వహణపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పరీక్షలను జూన్ నెల మొదటి, రెండవ వారాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు. 2021 డిసెంబర్‌లో జరగాల్సిన నెట్ పరీక్షలను కరోనా కారణంగా నిర్వహించలేదు. దీంతో 2021 డిసెంబర్, 2022 జూన్‌లలో నిర్వహించాల్సిన పరీక్షలు ఒకే సారి ఉంటాయని ఆయన వెల్లడించారు. నెట్ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామన్నారు. జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉత్తీర్ణత సాధించాలంటే యూజీసీ నెట్ పరీక్షలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఏటా యూజీసీ నెట్ పరీక్షలను ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు నిర్వహిస్తుంది. కరోనా కారణంగా నెట్ పరీక్షలను గతేడాది సమయానికి నిర్వహించలేకపోయారు. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాలలో నిర్వహిస్తోంది.