విద్యుత్తు వాహనాల కొనుగోలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. అయితే విద్యుత్ వాహనాల బ్యాటరీలు పేలిపోవడం, విద్యుత్తు వాహనాలు తగలబడటం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయితే ఈవీ బ్యాటరీలు ఎందుకు పేలుతున్నాయి? వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాటరీల పేలుడుకు ప్రధాన కారణాలివే..
- ఈవీల్లోని లిథియం-అయాన్ బ్యాటరీల్లో దాదాపు 100-200 వరకు సెల్స్ ఉంటాయి. వాటిని బ్యాటరీలో ప్యాక్ చేసే విధానంలో ఏమైనా తేడాలుంటే అవి పేలిపోయే అవకాశం ఉంటుంది.
- బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్ జరగడం కూడా పేలుడుకు కారణమవుతోంది.
- బ్యాటరీల్లో నాసిరకం సెల్స్ ఉండటం, బ్యాటరీ డిజైన్ లో లోపాలు ఉండటం
- ఛార్జింగ్ అవుతున్నప్పుడు నియంత్రణ లేని విద్యుత్తు బ్యాటరీకి అందటం
- వైరింగ్ లో తప్పిదాలు, ఫ్యూయల్ లైన్‌లో తేడాలు
- ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టి అలాగే వదిలేయడం
- వాహనాన్ని కడిగిన వెంటనే ఛార్జింగ్ చేస్తే అందులో సాకెట్ దెబ్బతింటుంది.
- బ్యాటరీ పేలిపోయే ముందు బాగా వేడెక్కుతుంది. తర్వాత పొగలు, మంటలు వస్తాయి.
- బ్యాటరీ వేడెక్కినట్లు భావిస్తే ఛార్జింగ్ ఆపేయాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- విద్యుత్ వాహనాలను మరీ ఎక్కువ ఎండలోనూ, మరీ చల్లని వాతావరణంలోనూ ఎక్కువ సమయం నిలిపి ఉంచొద్దు.
- ఛార్జింగ్ కి ఒరిజినల్ ఛార్జర్లనే వాడాలి.
- బ్యాటరీలను మండే స్వభావం కలిగిన వస్తువులకు దూరంగా ఉంచాలి.
- బ్యాటరీని ఎప్పుడూ 100% ఛార్జింగ్ చేయకూడదు. 20-80 శాతం మధ్య ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి.
- సూర్యకాంతి నేరుగా తగిలే చోట బ్యాటరీలను ఉంచొద్దు
- వాహనాన్ని వినియోగించిన తర్వాత దాదాపు గంట వరకూ ఛార్జింగ్ పెట్టొద్దు.