వాట్సప్ గ్రూప్స్ క్రియేట్ చేసినవారికి, చేసేవారికి అలర్ట్. ఇకపై వాట్సప్ గ్రూప్‌లో 256 మందిని కాదు ఏకంగా 512 మందిని యాడ్ చేయొచ్చు. ఇప్పటివరకైతే వాట్సప్ గ్రూప్‌లో 256 మంది సభ్యుల్ని మాత్రమే చేర్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు 512 మందిని యాడ్ చేసే అవకాశం కల్పిస్తూ కొత్త ఫీచర్ రిలీజ్ చేస్తోంది వాట్సప్. వాట్సప్ తీసుకొచ్చిన అనేక ఫీచర్స్‌లో గ్రూప్స్ ఫీచర్ కూడా ఒకటి. వాట్సప్ గ్రూప్స్ యూజర్లు అందర్నీ ఆకట్టుకుంటోంది. కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు, ఉద్యోగులు, విద్యార్థులు... ఇలా ఎవరికి కావాల్సినట్టుగా వాళ్లు వాట్సప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు. వాట్సప్ గ్రూప్స్‌లో యాక్టీవ్‌గా ఉంటున్నారు.
అయితే వాట్సప్ గ్రూప్స్‌లో ఎక్కువమంది సభ్యుల్ని చేర్చే అవకశం లేకపోవడం కొన్ని వర్గాలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా సంస్థల్లో ఉద్యోగులు, కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే అందర్నీ ఒకే గ్రూప్‌లో చేర్చే అవకాశం ఉండట్లేదు. దీంతో వేర్వేరు గ్రూప్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. యూజర్లు ఎదుర్కంటున్న సమస్యని గుర్తించిన వాట్సప్ గ్రూప్ మెంబర్స్ లిమిట్ పెంచడంపై ఆలోచిస్తున్నామని గతంలో ప్రకటించింది. మరో నెల రోజుల్లో గ్రూప్ మెంబర్స్ లిమిట్ 512 కి పెంచుతామంటూ గత నెలలో ప్రకటించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు అందరికీ అధికారికంగా ఈ ఫీచర్‌ని రిలీజ్ చేస్తోంది వాట్సప్.
ఇప్పటికే వాట్సప్ గ్రూప్స్ క్రియేట్ చేసినవారు తమ గ్రూప్‌లో అదనంగా సభ్యుల్ని చేర్చుకోవచ్చు. గరిష్టంగా 512 మందిని యాడ్ చేయొచ్చు. ఇక కొత్తగా వాట్సప్ గ్రూప్స్ క్రియేట్ చేసేవారు కూడా 512 మంది యూజర్లను యాడ్ చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ యాప్స్‌లో ఈ ఫీచర్ పనిచేస్తుంది.