‘మాస్ మహారాజా’ రవితేజ ఊచకోత
బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ విధ్వంసం!
తన మునుపటి చిత్రాలకు పూర్తి భిన్నమైన వైవిధ్యభరిత పాత్రలో ‘మాస్ మహారాజా’ రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఇందులో రవితేజ నటన, సరికొత్త మేకోవర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా, సినిమాను విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాయి.
విడుదలైన కేవలం 40 గంటల్లోనే ఈ చిత్రం మెజారిటీ ప్రాంతాల్లో బ్రేక్-ఈవెన్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుత థియేట్రికల్ మార్కెట్ పరిస్థితుల్లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అసాధారణమైన విషయంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో శనివారం అర్ధరాత్రి ప్రదర్శించిన షోలు సైతం హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. పలు ప్రాంతాల్లో టికెట్ల కోసం అభిమానులు ఎగబడటంతో భారీ డిమాండ్ నెలకొంది. లభిస్తున్న ఈ విశేష ఆదరణ చూస్తుంటే, రవితేజ సినీ ప్రస్థానంలోనే ఇది సరికొత్త మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది.
మొదటి రోజే ఈ చిత్రం రూ. 25 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు సమాచారం. పాజిటివ్ టాక్ తో పాటు విపరీతమైన రష్ ఉండటంతో, రెండో రోజు (శనివారం) వసూళ్లు తొలి రోజును మించి నమోదు కావడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ. 150 నుంచి రూ. 200 కోట్ల వరకు లైఫ్‌టైమ్ గ్రాస్ వసూలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అదే గనుక నిజమైతే రవితేజ కెరీర్‌లోనే ఇది ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం. మరి రాబోయే రోజుల్లో ‘ఇరుముడి’ రూ. 200 కోట్ల ఘనమైన మార్కును చేరుకుని బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తుందో లేదో వేచి చూడాలి.