రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు నిజామాబాద్ జిల్లాకే
కాంగ్రెస్ బలోపేతమే ధ్యేయం
నిజామాబాద్ అభివృద్ధే లక్ష్యం
రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు నిజామాబాద్ జిల్లాకే
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ యూనివర్సిటీని తీసుకువచ్చామని, మెడికల్ కాలేజీని సైతం సాధించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంజినీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాలలను తీసుకువచ్చామని, ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు నిజామాబాద్ జిల్లాలోనే మంజూరు చేశామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లింబాద్రి గుట్టపై గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ పరంగా రాష్ట్రంలోనే కీలక స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఆర్మూర్‌లో త్వరలో పామాయిల్ పరిశ్రమ రానుందని తెలిపారు. రైతులు, వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లా మాస్టర్ ప్లాన్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించినట్లు తెలిపారు.
బీజేపీపై తీవ్ర విమర్శలు
నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కొందరు నేతలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని, హద్దులు దాటితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
సంక్షేమం.. అభివృద్ధి.. పార్టీ బలోపేతం
కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తోందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అదే సమయంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. సహకార సంఘాల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన పదవులు కల్పిస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువగా ఉంటాయని, ఏదైనా సమస్య తలెత్తితే పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ వంటి నాయకులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ, నగేష్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ తదితరులు పాల్గొన్నారు.