ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మంత్రి పొన్నం భరోసా..

Select Suryaa Now

తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు చేపట్టనున్న నిరవధిక బంద్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సమస్యల పరిష్కారానికి సమ్మె కాకుండా ప్రభుత్వంతో చర్చలు జరపాలని డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని, చర్చల ద్వారా పరిష్కార మార్గాలను చూపుతామని భరోసా ఇచ్చారు.

ఆటో ఛార్జీల సవరణ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు మంత్రి తెలిపారు. 2015 నుంచి ఆటో ఛార్జీలు పెరగలేదని, పెరుగుతున్న ఇంధనం, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కమిటీలో రవాణా శాఖ అధికారులతో పాటు ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు.

ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బోర్డు కార్యకలాపాలకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుని సంక్షేమ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

పాత డీజిల్, పెట్రోల్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. పాత వాహనాలను స్క్రాప్ చేసి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసే డ్రైవర్లకు ప్రభుత్వ ప్రోత్సాహం అందించే అంశాన్ని వెల్లడించారు. పాత వాహనాలను గ్రీన్ ఎనర్జీ వాహనాలుగా మార్చుకునేందుకు రెట్రోఫిట్టింగ్‌కు సంబంధించిన కొత్త పథకాన్ని కూడా తీసుకురానున్నట్లు చెప్పారు.

ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు తమ బంద్ నిర్ణయాన్ని పునరాలోచించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.