గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం

Select Suryaa Now

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
తంగలపల్లి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
రూ.43 లక్షల సీసీ రోడ్లు ప్రారంభం
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన లక్ష్యం: మంత్రి పొన్నం

తెలంగాణ బ్యూరో ప్రతినిధిః హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.కోహెడ మండలం తంగలపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొని రూ.43 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తంగలపల్లి గ్రామంలో 26 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. 671 కుటుంబాలకు గృహజ్యోతి కింద రూ.22.41 లక్షల లబ్ధి చేకూరిందన్నారు. 1,121 మంది రైతులకు రైతుభరోసా కింద రూ.1.57 కోట్లు, 472 మంది రైతులకు రూ.3.73 కోట్ల రుణమాఫీ జరిగిందని వివరించారు. రైతుబీమా కింద 9 కుటుంబాలకు రూ.45 లక్షలు అందాయని, 503 పింఛన్లకు నెలకు రూ.11.29 లక్షలు విడుదలవుతున్నాయని తెలిపారు. పిల్లివాగుపై బ్రిడ్జి, చెక్‌డ్యామ్, శనిగరం చెరువు కాలువకు సీసీ నిర్మాణం, దుర్గమ్మ, బతుకమ్మ ప్రదేశాలకు రోడ్ల నిర్మాణం వంటి సమస్యలను సర్పంచ్ బోయిని సంపత్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పిల్లివాగు కాలువ విస్తరణకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
రైతులు ఆరుతడి పంటలతో పాటు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఎకరాకు 57 మొక్కలు, మూడేళ్లపాటు సబ్సిడీ అందుతుందని, అంతర పంటలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఎకరాకు ఏడాదికి సుమారు రూ.1.50 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. కోహెడ మండలంలో ఇప్పటికే 1,320 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని, నర్మేట ఫ్యాక్టరీకి తరలించే రవాణా ఖర్చును ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు.
ప్రజలు చెప్పే ప్రతి సమస్యను అధికారులు నమోదు చేసి, సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. మిగిలిన సమస్యలకు కాలపరిమితి నిర్ణయించి పరిష్కరించాలని సూచించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, చిన్నారుల సంక్షేమానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జలసిరి కింద ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వం రూ.6,500 ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. 14–15 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ టీకాలపై అవగాహన కల్పించాలని వైద్యశాఖ అధికారులను సూచించారు. ఈ నెల 31 వరకు పెన్షన్ల దరఖాస్తులు స్వీకరిస్తున్నందున అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, సర్పంచ్ బోయిని సంపత్, జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.