తహసీల్దార్ కార్యాలయంలో టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. అధికారులపై తీవ్ర ఆగ్రహం!

Select Suryaa Now

నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఊహించని షాక్ ఇచ్చారు. తనిఖీల్లో భాగంగా కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తుండగా, తీవ్ర అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను చూసి ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి, చేతికి గ్లౌజులు వేసుకుని అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను శుభ్రం చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న ఒక మంత్రి స్వయంగా పరిశుభ్రత చర్యలు చేపట్టడం చూసి అక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు తీవ్ర విస్మయానికి గురయ్యారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస పరిశుభ్రత పాటించకపోవడంపై తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బందిపై మంత్రి జూపల్లి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, మహిళలు ప్రతినిత్యం వచ్చే ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ తరహా నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్న ప్రాథమిక స్పృహ లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.