కొండా సురేఖ వ్యాఖ్యలపై రేవంత్ తీవ్ర ఆగ్రహం
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత తీవ్రంగా పరిగణించారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి తావులేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన పార్టీ ముఖ్య నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అధిష్ఠానం కూడా ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పరకాల బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన అభ్యర్థిత్వంపై స్పష్టత ఇచ్చారు. కానీ, ఆ మరుసటి రోజే సుస్మితా పటేల్ పరకాలలో వేరే సభ ఏర్పాటు చేసి సీఎం, ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, రాబోయే ఎన్నికల్లో పరకాల స్థానం నుంచే తాను పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించడం కలకలం రేపింది.
వరంగల్ పర్యటనకు స్థానిక మంత్రిగా ఉన్న కొండా సురేఖ రాకపోవడం, ఆ వెంటనే ఆమె కుమార్తె ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వ్యూహాత్మకంగానే జరిగినట్లు నాయకత్వం అనుమానిస్తోంది. బుధవారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా సీనియర్ మంత్రులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినట్లు సమాచారం.
సీఎం సూచనలతో స్పందించిన పీసీసీ క్రమశిక్షణా కమిటీ, మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను ఎలా బాధ్యత వహిస్తానని మంత్రి సురేఖ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సుస్మితా పటేల్ వ్యాఖ్యలను తేలికగా తీసుకోలేమని స్పష్టం చేశారు. స్వయంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడం సరికాదని, పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయని చెప్పారు. మంత్రి ఇచ్చిన వివరణ ఆధారంగా తదుపరి నిర్ణయాన్ని అధిష్ఠానం ప్రకటిస్తుందని పేర్కొన్నారు.
