మళ్లీ బ్రిటన్‌కు ప్రిన్స్ హ్యారీ-మేఘన్ జంట

Select Suryaa Now

బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరేళ్ల క్రితం అమెరికాకు మకాం మార్చిన ఈ జంట, తిరిగి బ్రిటన్‌లోనే శాశ్వతంగా నివసించాలని నిశ్చయించుకున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నెలలోనే వారు తమ పిల్లలతో కలిసి యూకేకు చేరుకోనున్నారు.

డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ తమ నివాసాన్ని కాలిఫోర్నియా నుంచి లండన్ వెలుపల ఉన్న ఒక ప్రైవేట్ నివాసానికి మార్చనున్నారు. అయితే, 2020 ఒప్పందం ప్రకారం వారు 'నాన్-వర్కింగ్ రాయల్స్'గా (ప్రైవేట్ పౌరులుగా) మాత్రమే ఉంటారు తప్ప, ఎలాంటి రాచరిక విధులను స్వీకరించరు. వీరి పిల్లలు ప్రిన్స్ ఆర్చి (7), ప్రిన్సెస్ లిలిబెట్ (5) సెప్టెంబర్ నుంచి బ్రిటన్‌లోని పాఠశాలలో విద్యనభ్యసించనున్నారు.

ప్రిన్స్ హ్యారీ ఆగస్టు 16న ఈ నిర్ణయాన్ని తన తండ్రి కింగ్ చార్లెస్ IIIకి తెలియజేశారు. మనవళ్లను తరచుగా కలుసుకునే అవకాశం లభిస్తుండటంతో కింగ్ చార్లెస్ హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేథరిన్‌లకు కూడా ఈ విషయం చేరవేసారు. హ్యారీ దంపతులు కాలిఫోర్నియా, పోర్చుగల్‌లలోని తమ నివాసాలను కూడా అలానే అట్టిపెట్టుకోనున్నారు.

ఈ వ్యవహారంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ స్పందిస్తూ.. రాచరిక విధుల్లో లేని వ్యక్తుల వ్యక్తిగత విషయాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేసింది.