మైనర్ల అక్రమ రవాణా కేసులో సంచలన తీర్పు
హైదరాబాద్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు 2015 నాటి మైనర్ల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల కేసులో బుధవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో మొత్తం 33 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు శిక్షలు ఖరారు చేశారు. ప్రధాన నిందితులైన ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
ముగ్గురికి 14 సంవత్సరాలు, 14 మందికి 10 సంవత్సరాలు, మిగిలిన 11 మందికి 3 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించారు. నరకయాతన అనుభవించిన 9 మంది మైనర్ బాలికలకు ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి ఒక బాలికను వ్యభిచార గృహానికి విక్రయించడంతో 2015 జులై 17న ఈ వ్యవహారం బయటపడింది. నాలుగు నెలల పాటు నిర్బంధంలో ఉన్న ఆ బాలిక అక్కడి నుంచి తెలివిగా తప్పించుకుని తెలంగాణ సీఐడీ మహిళా భద్రతా విభాగాన్ని ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు విస్తృత దాడులు చేసి 45 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 9 మంది మైనర్లతో పాటు పలువురు మహిళలను రక్షించారు. నిందితులపై పోక్సో, ఐపీసీ, అనైతిక రవాణా నిరోధక చట్టాల కింద ఛార్జిషీట్ దాఖలు చేయగా, సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ కఠిన తీర్పును వెలువరించింది.
