తెలంగాణలో అర్ధరాత్రి నుంచి రవాణా సేవలు బంద్
ఆటోలు, క్యాబ్‌లు నిలిచిపోయే అవకాశం
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం (23వ తేదీ) అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్ల సేవలు నిరవధికంగా బంద్ కానున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడం లేదని నిరసిస్తూ ఆటో, యాప్ ఆధారిత రవాణా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సాధారణ ప్రయాణికులకు, పాఠశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయాన్ని బకాయిలతో సహా అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఇంధన ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలు పెంచాలని కోరుతున్నారు. అనధికారికంగా సాగుతున్న బైక్ ట్యాక్సీ సేవలను అడ్డుకుని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రవాణా యాప్‌ను ప్రారంభించాలని స్పష్టం చేశారు.
ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా తమ ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంతో గత మూడేళ్లలో సుమారు 200 మంది డ్రైవర్లు ప్రాణాలు తీసుకున్నారని జేఏసీ నేత అర్లా సత్తిరెడ్డి తెలిపారు. ఈ బంద్‌కు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ (బీపీటీఎంఎం) పూర్తి మద్దతు తెలిపింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్చలు జరపకపోతే అసెంబ్లీ, ప్రజా భవన్ ముట్టడికి దిగుతామని నాయకులు హెచ్చరించారు.
