రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. గుడివాడలోని 10వ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ఎన్టీ రామారావు, మెగాస్టార్ చిరంజీవిల పేర్లు వాడకుండా ఎన్నికలకు వెళ్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు గుండు సున్నాతో సమానమన్నారు. వ్యక్తిగతంగా ఒక్క శాతం కూడా ఓట్లు లేని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసి.. 60 శాతం ఓటింగ్ ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏం చేయగలరని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ పీడ విరగడవుతుందన్నారు.
వచ్చే 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలవరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇక, వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ది జనసేన కాదు.. ధనసేన అని అన్నారు. పేమెంట్ రాగానే పవన్ మూమెంట్ మారిందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.