హైదరాబాద్: స్కాట్లాండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హైదరాబాద్, నెల్లూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉండగా మరొక విద్యార్థి బెంగళూరుకు చెందినవారు.ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు స్కాట్లాండ్ పోలీసు అధికారులు ప్రకటించారు.స్కాట్లాండ్ హైల్యాండ్‌లోని అప్పిన్ ప్రాంతంలో ఆగస్టు 19న రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన పవన్ బాశెట్టి (23), ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన సుధాకర్(30)తోపాటు బెంగళూరుకు చెందిన గిరీష్ సుబ్రహ్మణ్యం(23)లు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి సాయి వర్మ (24)కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆయనకు క్వీన్ ఎలిజబెత్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వీరిలో పవన్, సుబ్రహ్మణ్యంలు లైసెస్టర్ యూనివర్సిటీలో ఎరోనాటికల్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగా.. నెల్లూరుకు చెందిన సుధాకర్ మాత్రం ఇప్పటికే మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రమాదంలో గాయపడిన సాయివర్మ మాత్రం అదే యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ విత్ మేనేజిమెంట్ డిగ్రీ అభ్యసిస్తున్నాడు.ఈ ఘటనపై స్కాట్లాండ్ పోలీసులు.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. విహారయాత్రకు వెళ్లినట్లు భావిస్తోన్న ఈ నలుగురు విద్యార్థులున్న కారును ఓ భారీ వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ 47 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు వెల్లడించారు.ఈ ప్రమాద ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసివారు లేదా ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు ఎవరైనా ఉంటే వెంటనే తమకు సమాచారం తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.