చేపలు ధర ఎంత ఉంటుంది. మహా అయితే రూ.500 లేక పోతే రూ.1`వెయ్యిలోపు. కానీ ఆ చేపలకు ఉన్న క్రేజ్ మాత్రం వేరు. అంతేకాదు దాని ధర వింటే గుండె గుబ్బులు మొదలవ్వాల్సిందే. కాకినాడ జిల్లా సమీపంలోని యానాం మార్కెట్లో పులస చేప రికార్డ్ ధర పలికింది. స్థానికంగా నిర్వహించిన చేపల వేలపాట నిర్వహించగా.. మంగళవారం ఇక్కడి రేవులో చేపల వేలంపాటలో 2 కిలోల బరువున్న తాజా పులస చేపను నాటి పార్వతి అనే మహిళ దక్కించుకున్నారు.. దాన్ని భైరవపాలెంకు చెందిన వ్యక్తికి రూ.19 వేలకు విక్రయించారు. ఈ సీజన్‌లో ఇదే అధిక ధరని స్థానికులు చెబుతున్నారు. గత ఏడాది పులస రూ.25వేలు పలికింది. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ దగ్గర ఇసుక మేటల వల్ల సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు తక్కువగా వస్తున్నాయని మత్స్యకారులు అంటున్నారు.
గోదావరి జిల్లాల్లో ‘పుస్తెలు అమ్మి అయినా సరే, పులస తినాలి’ అనేది సామెత. మరి అంతలా ఉంది పులస చేప క్రేజ్. వేల కిలో మీటర్ల దూరం నుంచి ఖండంతరాలు దాటుతూ.. నీటికి ఎదురీదే లక్షణమున్న ఈ చేపకు మార్కెట్‌లో యమ డిమాండ్ ఉంటుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని అంటుంటారు. పులస చేప దొరకడమే చాలా అరుదు.. దీంతో జనాలు కొనుగోలు చేసేందుకు ఎగబడుతుంటారు. ఎంత ఖర్చైనా సరే వెనక్కు తగ్గరు.
వర్షాకాలం ప్రారంభమైన సమయంలో ఈ పులస చేపలు మార్కెట్‌లో కనిపిస్తుంటాయి. అందుకే పులసను సొంతం చేసుకునేందుకు జనాలు పోటీపడుతూ డబ్బుల్ని లెక్క చేయడం లేదు. అంతేకాదు ఈ పులస చేపలు ఎక్కువగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న అంతర్వేది, భైరవపాలెం, నరసాపురంలో ఎక్కువగా కనిపిస్తాయి. గోదావరి జలాలు సముద్రంలో కలిసే ఈ రెండు పాయల దగ్గరే పులసలు లభ్యం అవుతాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ పులసలు ఒడిశాతో పాటు బంగ్లాదేశ్ తీరాల్లో కూడా దొరుకుతాయట.. కానీ గోదావరి గోదావరి చేపలకు ఉండే చేపల రుచి వేరుగా ఉంటుదంటున్నారు. పులస శాస్త్రీయ నామం హిల్సాహిల్సా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్ర జలాల్లో సంచరించే ఈ చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టడానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సముద్ర జలాల్లోకి వస్తుందట. ఆషాడ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుందట. ఇలసగా పిలిచే ఈ చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగా ఎదురు వైపు ఈదుకుంటూ నదిలోకి వచ్చి రెండు మూడు రోజుల్లోనే పులసగా మారుతుందని చెబుతుంటారు.