పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికీ. సొంతింటి కల నెరవేర్చుకోవాలని తాపత్రయం పడుతున్న పేదప్రజల సంతోషానికి మధ్య వారథులుగా నిలవాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులను ఉద్దేశించి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే పేర్కొన్నారు. సమన్వయంతో ముందుకెళ్లి పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నిర్మాణాలు జోరుగా సాగేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోరాదని. నిర్దేశించిన లక్ష్యాలు చేరుకునే వరకు అహర్నిశలు శ్రమించాలని హితవు పలికారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై, ఓటీఎస్ ప్రక్రియ పురోగతిపై స్థానిక డీఆర్డీఏ సమావేశ మందరింలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటూ ఇళ్ల నిర్మాణాల్లో మరింత ప్రగతి సాధించాలని రాహుల్ పాండే పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సాహం అందించాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనలో ఉత్సాహం ప్రదర్శించాలని ఆశాజనక ఫలితాలు సాధించాలని నిర్దేశించారు. ఇంటి నిర్మాణాలకు అవసరమైన వనరులు ఇసుక, సిమెంటు, ఇనుము నిర్ణీత కాలంలో అందజేయాలని, బిల్లుల ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని సూచించారు.