జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనర్హత పై కేంద్ర ఎన్నికల సంఘం సిఫారస్సు చేసిందని వచ్చిన న్యూస్ మేరకు అత్యవసరంగా యూపీఏ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. బీజేపీ ఎత్తుకు పై ఎత్తు వేయాలని న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. అక్కడి కాంగ్రెస్, జేఎంఎం ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో చట్టంలోని అంశాలను అధ్యయనం చేస్తూ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని భారత ఎన్నికల సంఘం సిఫారసు చేసిన ఒక రోజు తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం యూపీఏ ఎమ్మెల్యేల సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్ రాజకీయ వ్యూహంపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎన్నికల సంఘం నివేదిక గవర్నర్ రమేష్ బాయిస్‌కు అందజేసిందని ప్రచారం రావడంతో వివాదానికి ప్రతిపక్ష బీజేపీయే కారణమని ఆయన ఆరోపించారు. సీల్డ్ కవర్‌లో ఉన్న నివేదికను బీజేపీ నేతలు, వారి తోలుబొమ్మలు రూపొందించినట్లు సోరెన్ విమర్శించారు. అధికారికంగా తనకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు.సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కోరడంతో ఆయన అసెంబ్లీ సభ్యత్వంపై ఎన్నికల సంఘం గవర్నర్‌కు లేఖ పంపింది. సోరెన్ తనకు మైనింగ్ లీజును పొడిగించుకుని ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని అక్కడి బీజేపీ నేతలు అభివర్ణించారు. ఈ అంశంపై గవర్నర్‌కు లేఖ రాశారు. పోల్ ప్యానెల్ సిఫారసులపై గవర్నర్ ఉత్తర్వులు జారీ చేయడంతో, సోరెన్ అసెంబ్లీ సభ్యత్వం ముగియవచ్చు. అటువంటి పరిస్థితిలో, అతను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చు. అయితే, సోరెన్ నేతృత్వంలోని JMM-కాంగ్రెస్ కూటమికి మెజారిటీ ఉంది. అసెంబ్లీలో, ఆయన రాజీనామా తర్వాత, మళ్లీ రాష్ట్రంలో ఆయనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దావా వేయవచ్చు.