సాంకేతికతపై సైబర్ నేరగాళ్ల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఆందోళన కలిగించే మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ సైబర్ యుగంలో ప్రతి ఖాతాకు భద్రత ఎంతో ముఖ్యం. అయితే, హ్యాకర్లకు దొరకని రీతిలో పాస్ వర్డ్ లు ఏర్పాటు చేసుకోవడం కాస్త క్లిష్టమైన వ్యవహారమే. అందుకే చాలామంది పాస్ వర్డ్ మేనేజర్ టూల్స్ పై ఆధారపడుతుంటారు. లాస్ట్ పాస్ అనేది ఓ పాస్ వర్డ్ మేనేజర్ టూల్. ఇది కష్టమైన పాస్ వర్డ్ లను, ఆటోజనరేటెడ్ పాస్ వర్డ్ లను అందిస్తుంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ల మంది ఉపయోగిస్తుంటారని అంచనా. ఇప్పుడా లాస్ట్ పాస్ హ్యాకర్ల బారినపడినట్టు నిపుణులు వెల్లడించారు.
తమ సోర్స్ కోడ్ ను, కీలకమైన యాజమాన్య సమాచారాన్ని ఓ హ్యాకర్ తస్కరించినట్టు లాస్ట్ పాస్ తన బ్లాగ్ పోస్టులో వివరించింది. తమ టూల్ డెవలపర్ కు చెందిన కంప్యూటర్ వ్యవస్థల్లో హ్యాకర్ చొరబడినట్టు గుర్తించామని, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపింది. అయితే, తమ వినియోగదారుల డేటా భద్రంగా ఉందని, హ్యాకర్ దాని జోలికి వెళ్లలేదని లాస్ట్ పాస్ వివరించింది. ఇదిలావుంటే లాస్ట్ పాస్ హ్యాకింగ్ కు గురైన విషయాన్ని తాము రెండు వారాల ముందే గుర్తించినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్ పేర్కొంది.