రాష్ట్రంలో వినాయక చవితి నిర్వహణ పైన, వినాయక విగ్రహాల నిమజ్జనం పైన ఎటువంటి ఆంక్షలు లేవని dgp కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది పోలీసులు కొత్తగా ఆంక్షలు విధిస్తున్నారంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని చెప్పారు.
ప్రజలు ఎప్పటిలా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు పోలీసు శాఖ పూర్తిగా సహకరిస్తుందని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక ఉత్సవ కమిటీలు స్థానికంగా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
వినాయక ఉత్సవాల నిర్వాహకులు ఎటువంటి అఫిడవిట్లు సమర్పించాల్సిన అవసరం లేదని డీజీపీ స్పష్టం చేశారు. వినాయక ఉత్సవాల నిర్వహణ కమిటీలకు పూర్తిగా సహకరించాలని ఎస్పీలు, డీఐజీలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏటా మాదిరిగానే వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు శాఖ ఈ ఏడాది కూడా సూచనలు చేస్తోందన్నారు.
ఎవరైనా ప్రభుత్వం విధించిన కాక ఇతర నిబంధనలు విధిస్తే అదనపు డీజీ (శాంతి భద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్ (ఫోన్: 99080-17338), డీఐజీ రాజశేఖర్‌బాబు (ఫోన్: 80081-11070) దృష్టికి తీసుకు రావాలని తెలిపారు.