ఆసియా కప్ 2022లో శ్రీలంక జట్టు సూపర్-4లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ప్రదర్శనతో రాణించి 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరు లో సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగుల భారీ స్కోరు చేసింది. మెహదీ హసన్ మీర్జా (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38), అఫీఫ్ హొస్సేన్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) రాణించారు. లంక బౌలర్లలో హసరంగ, కరణరత్నే రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) అర్ధ సెంచరీ సాధించాడు. దాసన్ షనక (33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టెయిలెండర్లు కూడా విలువైన పరుగులు చేయడంతో జట్టు విజయం సాధించింది. ముఖ్యంగా ఫెర్నాండో (10 నాటౌట్) విజయానికి అవసరమైన పరుగులు చేశాడు. బెంగాలీ బౌలర్లలో ఎబాదత్ హొస్సేన్ మూడు వికెట్లు తీశాడు. టస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. ముస్తాఫిర్ రెహమాన్, మెహదీ హసన్ చెరో వికెట్ తీశారు.
184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక (20), కుశాల్ మెండిస్ శుభారంభం అందించారు. 45 పరుగులు జోడించిన తర్వాత నిస్సాంక తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఎబాదత్ హొస్సేన్ వేసిన ఆరో ఓవర్‌లో క్యాచ్ ఔటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన అసలంక (1) ఔట్ కావడంతో పవర్ ప్లే ముగిసే సరికి లంక 2 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. తన తర్వాతి ఓవర్‌లో దనుష్క తిలక (11)ను ఎబాదత్ హోసెన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత భానుక రాజపక్సను టస్కిన్ అహ్మద్ ఔట్ చేయగా.. కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో అతడిని ముస్తాఫిజుర్ రెహమాన్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన వానిందు హసరంగా (2)ను టస్కిన్ అహ్మద్ ఔట్ చేయగా.. కెప్టెన్ దాసన్ షనక ఒంటరి పోరాటం చేశాడు. కానీ మెహ్దీ హసన్ అతనిని క్యాచ్ అవుట్ చేయడంతో లంక విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉంది. 19వ ఓవర్‌లో 16 పరుగులు రాగా, చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరి ఓవర్లో బంగ్లాదేశ్ నో బాల్‌తో మూల్యం చెల్లించుకుంది. ఫెర్నాండో రెండు బౌండరీలతో విజయాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో లంక బౌలర్లు నాగిని డ్యాన్స్ చేసి బంగ్లాపై ప్రతీకారం తీర్చుకున్నారు.