ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యావ్యవస్థ మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 03:25 PM

విజయవాడ: మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా శిల్పంలా మారుతుందని, అద్భుత శిల్పాలు చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం జగన్‌ మాట్లాడారు. 


ఉపాధ్యాయులందరికీ టీచర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సబ్జెక్ట్‌తో పాటు వివేకాన్ని కూడా పెంచుతారని.. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తారన్నారు. స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రపంచంతో పోటీ పడలేని తమపై రుద్దిన చదువును వేరే గత్యంతరం లేక చదువుకుంటున్న దుస్థితిలో ఉన్నామని సీఎం జగన్  అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా దృష్టి సారించి మార్పులు చేస్తోందని స్పష్టం చేశారు. ఈ మార్పులు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావని, వారిని ఇబ్బంది పెట్టాలని తీసుకున్న నిర్ణయాలూ కావని తెలిపారు. 


ఉపాధ్యాయుల చేతిలో శిల్పాలుగా మారే పిల్లల భవిష్యత్తును మరింత మెరుగ్గా ఉంచేందుకు తీసుకొస్తున్న మార్పులని పేర్కొన్నారు. అట్టుగడున ఉన్న పేద సామాజిక వర్గాల చరిత్రను పూర్తిగా మార్చేవని చెప్పారు. మరింత అర్థవంతమైన, భవిష్యత్‌ తరాలకు అవసరమైన చదువుల కోసం అడుగులు ముందుకు వేస్తున్నామని వెల్లడించారు. మంచి చదువులకు పేదరికం అడ్డు కాకూడదని, విద్య అందరికీ అందుబాటులో ఉండాలని చేస్తున్న మార్పులినని సీఎం జగన్  స్పష్టం చేశారు.గత ప్రభుత్వం మాదిరిగా టీచర్లు, ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసే మార్పులు కావన్నారు. అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా విద్యారంగాన్ని తీర్చిదిద్దుతూ అడుగులు వేస్తున్నామని చెప్పారు. 


ప్రభుత్వ బడికి ఆ గుర్తింపు, వైభవం రావాలన్న తపనతో మార్పులు చేస్తున్నామని, హాజరుశాతం, అక్షరాస్యత పెంచడం, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్పొరేట్‌ స్కూల్‌ కంటే ప్రభుత్వ బడి బాగుండాలని మార్పులు చేస్తున్నామని పేర్కొన్నారు. పేదల పిల్లలు మాత్రమే కాకుండా టీచర్ల పిల్లలు కూడా అదే ప్రభుత్వ పాఠశాలలో చదివించే పరిస్థితి రావాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం జగన్‌ చెప్పారు. అనంతరం రాష్ట్రంలోని 176 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సీఎం అందజేశారు.


గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
చదువు నేర్పుతున్న గురువులకు శిరస్సు వంచి వందనాలు. ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా అద్భుత శిల్పంగా మారుతుంది. అద్భుత శిల్పాలు చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులు. టీచర్లు.. విద్యార్థులకు సబ్జెక్ట్‌తో పాటు వివేకాన్ని కూడా పెంచుతారు. గురువులు.. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ప్రపంచంలో చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధిస్తారు. ఉపాధ్యాయులను గొప్పగా గౌరవించాలి. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధ్యాయులే వెలికితీస్తారు. విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. విద్యార్థులు తనకంటే గొప్పవాళ్లు కావాలని టీచర్‌ ఆరాటపడుతుంటారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. నాణ్యమైన చదువులు అందరికీ అందుబాటులో ఉండాలి. పేదరికం... చదువుకు అడ్డుకాకూడదు. ఎవరూ అడగకపోయినా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాం. ఎస్జీటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాం. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని సీఎం జగన్  వెల్లడించారు.


నిరసనల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు
విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకల్లో సీఎం జగన్  పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చేస్తారన్న హెచ్చరికలతో పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. సీఎం ఎదురుగా నిరసనలు లేకుండా పోలీసుల పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నవారినే సభా మందిరంలోకి పంపారు. టీచర్ల చేతి రుమాళ్లు, పెన్నులు, పేపర్లను సభలోకి అనుమతించలేదు. తనిఖీ కేంద్రం వద్దే గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నల్ల చొక్కా ధరించిన వారిని సభలోకి అనుమతించలేదు. సభా ప్రాంగణానికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెద్దఎత్తున తరలివచ్చారు. ఉపాధ్యాయుల హాజరుపై సందిగ్ధంతో సచివాలయ ఉద్యోగుల తరలించారు. ఉపాధ్యాయులు రావడంతో సచివాలయ సిబ్బందిని అధికారులు వెనక్కిపంపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa