గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఎయిర్ పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి వెల్లడించారు. ఇదిలావుంటే విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నూతన డైరెక్టర్ గా మల్లకంటి లక్ష్మీకాంత రెడ్డి నియమితులయ్యారు. లక్ష్మీకాంత రెడ్డి ఇప్పటివరకు గన్నవరం ఎయిర్ పోర్టులో కమ్యూనికేషన్ నేవిగేషన్ సర్విలెన్స్ విభాగాధిపతిగా పనిచేశారు. ఇప్పుడాయనను ఎయిర్ పోర్టుకు పూర్తిస్థాయి డైరెక్టర్ గా నియమిస్తూ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు గన్నవరం ఎయిర్ పోర్టుకు ఇన్చార్జి డైరెక్టర్ గా రామారావు వ్యవహరించారు. ఇవాళ రామారావు నుంచి లక్ష్మీకాంత రెడ్డి బాధ్యతలు అందుకున్నారు.
ఎయిర్ పోర్టు డైరెక్టర్ హోదాలో లక్ష్మీకాంత రెడ్డి మాట్లాడుతూ, గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. కరోనా సంక్షోభం తర్వాత మళ్లీ విమానాలు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయని వెల్లడించారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు కొత్తగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం మంజూరైందని, రూ.417 కోట్లతో నిర్మాణం జరుగుతోందని తెలిపారు. మరో 10 నెలల్లో భవన నిర్మాణం పూర్తవుతుందని లక్ష్మీకాంత రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ, దేశీయ విమానాల ప్రయాణికులు ఒకే బిల్డింగ్ నుంచి ఏరో బ్రిడ్జిల ద్వారా రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని వివరించారు.