అప్పులిచ్చే వారి పైశాచికం కొత్త పుంతలు తొక్కుతోంది. తమ అప్పు వసూళ్ల కోసం క్రిమినల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇదిలావుంటే విశాఖలో హైపర్ బాయ్స్ వ్యవహారం కలకలంరేపుతోంది. కంచరపాలెంలో 'హైపర్ బాయ్స్' కొద్దిరోజులుగా రెచ్చిపోతున్నారు. మారణాయుధాలతో నగరంలో విచ్చిలవిడిగా తిరుగుతున్నారు. చివరికి పోలీసులు ఏడుగురు సభ్యుల ఈ ముఠా ఆటకట్టించారు.. విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ గ్యాంగ్ 'హైపవర్ బాయ్స్' పేరిట వాట్సాప్ గ్రూప్ సృష్టించారు.. నగరంలో సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. కార్తీక్ అనే యువకుడు లీడర్‌గా కుమార్, రామకృష్ణలతో కలిసి మరో నలుగురి కలుపుకుని దందాలు నడుపుతున్నారు.
ఈ గ్యాంగ్ మారణాయుధాలు, గంజాయితో సంచరిస్తోంది. శనివారం అర్ధరాత్రి విశాఖ కంచరపాలెం ఊర్వశి కూడలి వద్ద మారణాయుధాలతో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేశారు. ఓ ఆటో దగ్గర నిందితులు దుంప రామకృష్ణ, కార్తీక్, శ్యామలరావు, సురేష్ పాల్, ఆకాశ్, రమణ, చందు, జనార్దన్ మారణాయుధాలు, ఆరు కిలోల గంజాయితో కనిపించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరికొందరు పారిపోయారు.
నగరంలో చిన్నచిన్న వ్యాపారస్తులు, నిరుద్యోగులు, గృహి ణులు, అప్పులు తీసుకుంటున్నారు. జనాలు ఫైనాన్స్ ఇచ్చే వారంతా ఈ హైపర్ బాయ్స్‌ను పావులా వాడుకుంటున్నారు. వడ్డీలకు డబ్బులు ఇచ్చేవారు కొందరు తమకు అప్పులు వసూలు కాకపోతే ఈ గ్యాంగ్‌ను సంప్రదిస్తారు. వీళ్లు రుణగ్రహీతలను బెదిరించి రావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తమే రాబడతారట. ఈ గ్యాంగ్‌కు నెలవారీ మామూళ్లు ఇస్తున్నారు.
తాజాగా ఓ వ్యక్తికి ఫైనాన్షియర్ అప్పు ఇవ్వగా తీర్చడంలో కాస్త లేట్ అయ్యింది. ఈ బ్యాచ్ బాధితుడి దగ్గరకు వెళ్లి.. మారణాయుధాలతో బెదిరించారు. తాము చెప్పింది వినకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. ఎక్కడైనా నోరెత్తితే అంతు చూస్తామంటూ కత్తులు చూపించడంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు ఎదురు తిరిగితే వారిని బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు.
వీరిలో కార్తీక్‌పై కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదై ఉంది. ఈ హైపవర్ బాయ్స్ పేరిట వాట్స్ యాప్ క్రియేట్ చేసుకుని దాని ద్వారానే దందాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఊర్వశి జంక్షన్లో కూడా ఇదే తీరుగా వ్యవహరించడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది గట్టి నిఘా పెట్టి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు.