రాష్ట్రంలోని ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని.. క్లీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని పేర్కొన్నారు. అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 81 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని సీఎం జగన్ వెల్లడించారు. దీని వల్ల 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుందని చెప్పారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయని తెలిపారు. ఈ పెట్టుబడుల వల్ల ఉద్యోగాలతో పాటు రైతులకు మేలు జరుగుతుందన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు ఏపీ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయని.. భారీ సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.
రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ. 30 వేల వరకు లీజు కింద డబ్బు వస్తుందని సీఎం జగన్ చెప్పారు. దీని వల్ల వారికి ఆదాయాలు కూడా పెరుగుతాయని.. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటి కోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయని అభిప్రాయపడ్డారు. వాటి ద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. అటు వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కాసిస్ ఈ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్‌ఐపీబీ సమావేశంలో అధికారులు వెల్లడించారు.