ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా మంగళవారం ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) మెరుపు దాడులు చేసింది.దేశవ్యాప్తంగా ఏకకాలంలో మొత్తం 30 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, లక్నో, గురుగావ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఆరు చోట్ల తనిఖీలు జరుపుతున్నట్టు తెలిసింది. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రన్‌పిళ్లై సహా మరో అయిదుగురికి సంబంధించిన కంపెనీలు, ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లో అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. రాబిన్ డిస్టిలర్స్ పేరుతో రామచంద్రన్ పిళ్లై బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
కాగా.. ఈ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. మొత్తం 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. వారిలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కూడా ఉండడం రాజకీయంగా ప్రకంపనలు చెలరేగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత హస్తం కూడా ఉందని కొన్ని రోజుల క్రితం బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! అయితే.. కవిత ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ, తనపై ఆరోపణలు చేసిన వారి మీద కోర్టుకెక్కింది. ఈ కేసులో ఆమెకు ఊరట లభించింది. బీజేపీ నేతలకు కోర్టు నోటీసులు పంపించడంతో పాటు, కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది.