ప్రజల ప్రాణాలు తీస్తున్న లోన్ యాప్ లపై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించటానికి సిద్ధమైంది. అడ్డగోలుగా పుట్టుకొస్తున్న డిజిటల్ రుణయాప్ ల కట్టడికి వేగంగా అడుగులు వేస్తోంది. దీంట్లో భాగంగా..కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. లోన్ యాప్‌ల ఆగడాలు, అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతోమందిని ఆత్మహత్య చేసుకునేలా వేధిస్తోన్న ఈ లోన్ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.దీనిలో భాగంగా చట్టబద్దమైన యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్‌బీఐకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
వైట్ లిస్ట్‌లో ఉన్న లోన్ యాప్‌లను మాత్రమే యాప్ స్టోర్‌లలో హోస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గుర్తింపు ఉన్న యాప్ ల జాబితా తయారు చేయాలని ఆదేశించింది. ఆర్బీఐ రూపొందించనున్న జాబితాలోని లోన్ యాప్ లు మాత్రమే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లాంటి యాప్స్ లో అందుబాటులో ఉండే విధంగా చర్యలుతీసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు సూచించారు. అదేవిధంగా లోన్ యాప్‌ల లావాదేవీలపై ఈడీ, సీబీఐ దృష్టి సారించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు. ఇక లోన్ యాప్ లో అమాయక ప్రజల ఖాతాలద్వారా మనీలాండరింగ్ కు పాల్పడుతున్నాయా?అని ఆర్బీఐ పర్యవేక్షించనుంది.దీనికి అవకాశం ఉన్న అకౌంట్లపై కన్నేసి ఉండాలని మంత్రి సూచించారు. అటు నిర్దేశిత సమయంలో పేమెంట్ అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా ఆర్బీఐ జాగ్రత్త పడనుంది.
ఆన్ లైన లోన్ యాప్ ల ఆగడాలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది బలైపోయారు. లోన్ యాప్‌లో రుణం తీసుకుంటే ఇక చావే శరణ్యం అన్నంతగా వేధిస్తున్నారు రికవరీ ఏజెంట్లు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది ఉసురు తీశాయి లోన్ యాప్‌లు. వద్దన్నా లోను ఇవ్వటం..ఆపై వేధింపులు సాధింపులు..ఫ్యామిలీ ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులు..దీంతో మనస్తాపంతో ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ లోన్ యాప్ లో వేధింపులకు ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి.