డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో జిల్లాలో చదువుతున్న డిగ్రీ రెండవ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి. లాఠకర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ రెండో విడత సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య నిమ్మ వెంకటరావుతో కలిసి ఈ సమీక్షా సమావేశాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు.
దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ తరహా ఇంటర్న్షిప్ ద్వారా అటు విద్యార్థులకి ఉపాధితో పాటు సమాజానికి, పరిశ్రమల కు నైపుణ్యమైన యువత అందించేందుకు దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు రెండు నెలల పాటు ఈ ఇంటర్న్షిప్ ని ఆయా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కంపెనీలు, సంస్థలు ప్రస్తుతం ఇవనున్నాయని తెలిపారు. ఇప్పటివరకూ ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆర్ట్స్, కామర్స్, సైన్స్ డిగ్రీ విద్యార్థులు కూడా కల్పిస్తున్నామని తెలియజేశారు.
ఆయా మండలాల పరిధిలోని డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు అదే ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యాలయాల్లో ఈ ఇంటర్న్షిప్ పూర్తి చేస్తారు అని కలెక్టర్ చెప్పారు. డాక్టర్ బిఆర్ఏయూ వైస్- ఛాన్సలర్ ఆచార్య నిమ్మ వెంకటరావు మాట్లాడుతూ జిల్లాలో 104 డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఇది వర్తింప చేస్తామని తెలియజేశారు. ఇప్పటికే గత నెల 12వ తేదీన జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించి దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడమే కాకుండా ఆయా కార్యాలయాలు, బ్యాంకులు, పరిశ్రమలు, హాస్పిటల్స్, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఎన్జీవో సంస్థలు, చేనేత, గ్రానైట్, జీడి తదితర పరిశ్రమలు గుర్తించినట్లు తెలిపారు. తన కోర్సులో భాగంగా విద్యార్థి ఖచ్చితంగా ఈ ఇంటర్న్షిప్ చేయవలసి ఉంటుందని, దీనికి సంబంధించిన నిబంధనలు అనుబంధ కళాశాలలకు తెలియజేసినట్లు వీసీ చెప్పారు. పలువురు జిల్లా స్థాయి ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యా సంస్థలు, బ్యాంకులు, పరిశ్రమల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.