ఎఫుడు ఏదో ఒక వివాదాస్పద కార్యక్రమంతో వార్తల్లో నిలిచే మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, హీరోయిన్ నవనీత్ రాణా మళ్లీ వార్తల్లోకి నిలిచారు. ఆమె, ఆమె భర్త రవి రాణా వినాయక నిమజ్జన కార్యక్రమంతో హాట్‌టాపిక్ అయ్యారు. ఎంతో భక్తి, శ్రద్ధలతో గౌరవ ప్రదంగా నిర్వహించాల్సిన గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్లక్ష్యంగా చేశారని నెటిజన్లు వారిపై మండిపడుతున్నారు. నిమజ్జనం సందర్భంగా వినాయక విగ్రహాన్ని మురికి నీటిలో ఎత్తి పడేశారు.
బీజేపీకి మద్దతుగా ఉన్న నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాలు గతంలో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి దగ్గర హనుమాన్ చాలీసా పఠనం చేస్తామని పిలుపునిచ్చారు. అది వివాదాస్పదమైంది. శివసేన కార్యకర్తలు వారి ఇంటిని చుట్టుముట్టి నిరసన తెలిపారు. దాంతో వారు తమ పిలుపును వెనక్కి తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి వారు ఏదోక రూపంలో వార్తల్లోనే ఉంటున్నారు. తాజాగా వినాయక విగ్రహం నిమజ్జన కార్యక్రమంతో వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గణపయ్య విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయకుండా నిర్లక్ష్యంగా నీటిలో పడేశారు. ఆ నీరు కూడా చాలా మురికిగా ఉంది.
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. వినాయకుడిని, హిందూ మతాన్ని అవమానించినందుకు వారిపై కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు. హిందుత్వ కాంట్రాక్టర్ల చర్యలు ఇలాగే ఉంటాయని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకెవరైనా ఇలా చేసి ఉంటే రాణా దంపతులు, బీజేపీ పెద్ద వివాదమే చేసేవారని కూడా యూజర్లు కామెంట్లు పెట్టారు.
అలాగే శివసేన ఉప నాయకురాలు సుష్మా అంధారే కూడా ఎంపీ నవనీత్ రాణాను టార్గెట్ చేశారు. మతం పేరుతో నవనీత్ రాణా ప్రారంభించిన హింసను అరికట్టాలని ఆమె అన్నారు. హిందుత్వ కోసం ఆమె నిరంతరం గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. వినాయక నిమజ్జనం ఎలా చేయాలో వారికి తెలియదా..? అని ప్రశ్నించారు. ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు ఇలా ఏదో ఒకటి చేస్తుంటారని విమర్శించారు. పనిపై మరో శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది రానా దంపతులపై విరుచుకుపడ్డారు. గణేశ నిమజ్జన సమయంలో అనుసరించాల్సిన పద్ధతులను పాటించలేదన్నారు. ఇది చాలా నేరమైన చర్య అని ఆరోపించారు.