సీనియర్ సిటిజన్ అంటే ఎవరికైనా గౌరవమే. అలాంటి గౌరవమే ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. అంతేకాదు ప్రేమను కూడా వారికి అమితంగా పంచేస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌దారులకు బ్యాంకులు శుభవార్తలు చెబుతున్నాయి. వరుస బెట్టి చాలా బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. మూడు నెలల్లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 140 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచడంతో.. బ్యాంకులు కూడా తన డిపాజిట్ ఖాతాదారులకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. బ్యాంకులు చేస్తున్న ఈ ప్రకటనలు ముఖ్యంగా చిన్న డిపాజిట్‌దారులకు, పదవీ విరమణ చేసిన వారికి భారీ ఊరటనిస్తున్నాయి. బ్యాంకులు కూడా సాధారణ డిపాజిట్‌దారులకు ఆఫర్ చేసే దాని కంటే ఎక్కువ మొత్తంలోనే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని అందిస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల వరకు ఎక్కువగా ఉంటున్నాయి.
ప్రస్తుతం మనం ఏయే బ్యాంకులలో సీనియర్ సిటిజన్లకు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అత్యధికంగా లభిస్తున్నాయో చూద్దాం.. ఇండస్‌ఇండ్ బ్యాంకు 60 ఏళ్లు పైబడిన వారికి ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు సీనియర్ సిటిజన్ స్కీమ్ కింద అత్యధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది. దీన్ని కేవలం సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే లాంచ్ చేసింది బ్యాంకు. రూ.2 కోట్ల కంటే తక్కువున్న డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఇండస్‌ఇండ్ బ్యాంకు 7.50 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
డీసీబీ బ్యాంకు డీసీబీ బ్యాంకు కూడా సీనియర్ సిటిజన్లకు తమ ఎఫ్‌డీలపై 7.10 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. 18 నెలల నుంచి 700 రోజులు, 700 రోజుల పైనుంచి 36 నెలలు, 36 నెలల పై నుంచి 60 నెలలు, 60 నెలల పైనుంచి 120 నెలల వరకు కాల వ్యవధిలోనే మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు డీసీబీ బ్యాంకు ఈ వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది.
ఆర్‌బీఎల్ బ్యాంకు 24 నెలల నుంచి 36 నెలల కంటే తక్కువ కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే రూ.2 కోట్ల తక్కువున్న డిపాజిట్లపై ఆర్‌బీఎల్ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. 36 నెలల నుంచి 60 నెలల కంటే తక్కువ వ్యవధిలో,60 నెలల్లో మెచ్యూర్ అయ్యే రూ.2 కోట్ల కంటే తక్కువున్న డిపాజిట్లకు, ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి బ్యాంకు 7.05 శాతం వడ్డీని అందిస్తుంది.
కొటక్ మహింద్రా బ్యాంకు 390 రోజుల నుంచి 23 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై కొటక్ మహింద్రా బ్యాంకు 6 శాతం వడ్డీని అందిస్తుంది. 23 నెలల నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై బ్యాంకు 6.10 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. 2 ఏళ్ల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై వడ్డీ రేటును బ్యాంకు 6 శాతానికి పెంచింది. 23 నెలల నుంచి రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీ రేట్లు 6.10 శాతంగా ఉన్నాయి.