రష్యాకు ఇతర అగ్ర దేశాలకు మధ్య నెలకొన్న మనస్పర్థలు కాస్త భారత్ కు ఎంతో కలిసొస్తున్నాయి. తాజాగా రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్ దిగుమతులపై ధరల పరిమితి విధించాలని జీ7 దేశాలు రంగంలోకి దిగుతున్న క్రమంలో.. మళ్లీ మాస్కో దేశం భారత్‌కు ఎర వేస్తుంది. భారత్‌కు అంతకుముందు అందించిన దాని కంటే తక్కువకే క్రూడాయిల్‌ను అమ్ముతామని మాస్కో మన దేశానికి చెబుతున్నట్టు అధికారులు తెలిపారు. జీ7 ప్రతిపాదనకు ప్రస్తుతం భారత్ సపోర్టు ఇవ్వడం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై తాము నిర్ణయం తర్వాత తీసుకుంటామని చెప్పారు. గత రెండు నెలలో ఇరాక్ అందించిన దాని కంటే ఎక్కువగా రష్యా డిస్కౌంట్లను ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
మే నెలలో కూడా రష్యా క్రూడాయిల్‌ను భారత్‌కు చౌకగా అందించింది. బ్యారల్‌పై 16 డాలర్లను తగ్గించింది. అప్పుడు యావరేజ్‌గా ఇండియన్ క్రూడ్ ఇంపోర్టు బాస్కెట్ ధర బ్యారల్ 110 డాలర్లుగా ఉంది. జూన్ నెలలో బ్యారల్‌పై 14 డాలర్ల డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. అప్పుడు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర బ్యారల్ 116 డాలర్లుగా ఉంది. అయితే ఆగస్టు నెలలో కేవలం 6 డాలర్లను మాత్రమే తగ్గించింది. అయితే యూరోపియన్ దేశాలతో పోలిస్తే.. భారత్‌కి తక్కువగానే రష్యా ఆయిల్‌పై డిస్కౌంట్ లభించిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద ఆయిల్ సరఫరాదారిగా ఇరాక్ ఉంది. రష్యా మూడో స్థానంలో ఉంది. దేశ ఆయిల్ అవసరాల్లో 18.2 శాతం మాత్రమే రష్యా తీరుస్తుంది. ఇరాక్ మన ఆయిల్ అవసరాల్లో 20.6 శాతం తీరుస్తుండగా.. సౌదీ అరేబియా 20.8 శాతం డిమాండ్‌ను నెరవేరుస్తుంది. ఈ రెండే మనకి అతిపెద్ద ఆయిల్ ఎగుమతిదారులుగా ఉన్నాయి. ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి కూడా మనం గల్ఫ్ దేశాల నుంచే భవిష్యత్‌లో ఆయిల్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకోనున్నామని చెప్పారు.
అయితే రష్యాకు జీ7 దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్‌లతో పాటు యూరోపియన్ దేశాలు రష్యన్ ఆయిల్ ధరలపై పరిమితి విధించబోతున్నాయి. దీంతో మాస్కో దేశాన్ని ఆర్థికంగా కట్టడి చేయాలని భావిస్తున్నాయి. మరోసారి భారత్‌కు డిస్కౌంట్లో ఆయిల్ సరఫరా చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. ఈ వార్తల నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ దిగొచ్చేనా.. అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పడినప్పటికీ కంపెనీలు దేశీయంగా ధరలను తగ్గించకుండా స్థిరంగా ఉంచాయి. కానీ ప్రస్తుతం మరోసారి రష్యా డిస్కౌంట్‌లో ఆయిల్ అందిస్తామంటూ భారత్‌కు ఆఫర్ చేస్తుండటంతో.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా దిగొచ్చే అవకాశముందని తెలుస్తోంది.