ధర్మవరం: కులాంతర వివాహం చేసుకుంటే దాడులు చేస్తారా అనిటీడీపీ నాయకులు ప్రశ్నించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ కార్యదర్శి కమతంకాటమయ్యతో పాటు టీడీపీ నాయకులు మాట్లాడారు. మండల పరిధిలోని మల్లేనిపల్లి గ్రామంలో బీసీవర్గాలపై అగ్రవర్ణకులాల వారు దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 15 రోజుల క్రితం ఆగ్రవర్ణకులాల చెందిన అమ్మాయి బీసీవర్గానికి చెందిన అబ్బాయి కులాంతర ప్రేమ వివాహం చేసుకోవటంతో అగ్రవర్ణకులానికి చెందిన కొంతమంది అబ్బాయి బంధువులపై ద్వేషం పెంచుకుని ఆదివారం రాత్రి దాడులకు దిగారన్నారు. గ్రామానికి చెందిన చంద్రశేఖర్, పూజారి ఓబుళేసు, కాటమయ్య, నాగేంద్రలపై విక్షణ రహితంగా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. వీరు టీడీపీకి సానుభూతి వరులుగా ఉన్నారన్న నెపంతోనే దాడులు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. దాడులకు పాల్పడిన వారిని పోలీసులు తక్షణమే అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పురుషోత్తంగౌడ్, పరిశేసుధాకర్, మేకల రామాంజినేయులు, పోతుకుంట లక్మన్న, రమేష్, గోసలశ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.