మడకశిర: వరుస వర్షాలతో చేతికి వచ్చిన పంట నోటి కందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలుగా విస్తారంగా వర్షాలు కురవడంతో చెరువులు కుంటలు వాగులు వంకలు పొంగిపొర్లాయి. నీటి శాతం అధికమై కోతకొచ్చిన పంట కళ్ళముందే నిట్ట నిలువునా హరించుకు పోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. అతివృష్టితో ఈ ఏడాది నష్టపోతున్నామని వాపోతున్నారు. పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండే మొక్కజొన్న పంటను మండల వ్యాప్తంగా దాదాపు 400 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే అత్యధిక వర్షపాతం నేపథ్యంలో మరోవైపు పంట పొలాలపై రోజుల తరబడి వంకలు వాగులు ప్రవహించడంతో పంట చేతికందకుండా పోయింది. పంట నమోదు కార్యక్రమం చేపట్టకుండానే పంట ఇలా కావటంతో అధికారులు తమ పంటను సాగుచేసిన విధంగా నమోదు చేస్తారో అని ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 80శాతం మేర పంట పూర్తిగా నష్టపోయింది. వంకలు వాగులు ప్రవహించే గట్ల పక్కన గల పొలాల్లో అయితే వందశాతం నష్టం వాటిల్లింది. దిగుబడితోపాటు పశుగ్రాసం సైతం దక్కని దయనీయ పరిస్థితి నెలకొంది.
సాయమందనివ్యవసాయం చేయాలంటేనే వెను కంజ వేస్తున్న రైతన్నలకు ఈ వర్షం శాపంలా తయారైంది. ఒకవేళ సాధారణ వర్షపాతం నమోదు అయ్యి ఉంటే పంట చేతికి వచ్చి రైతు ఇంట ఆనందం వెల్లు విరిసేది. వ్యవసాయ అధికారులు మాత్రం సచివాలయాలకే పరిమితమవుతున్నారే తప్ప పొలాల బాట పట్టి పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. గత ఏడాది ఇష్టారాజ్యంగా కొండ ప్రాంతాలకు సైతం పంట నమోదు చేసి నిజంగా పంట సాగు చేసిన రైతుకు మొండి చేయి చూపారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు రైతులు వ్యవసాయ అధికారుల నిలదీస్తుంటే దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదులో చేయిస్తున్నారు. రెండు రోజుల క్రితం మనూరులో ఓ రైతు 'గత సంవత్సరం మమ్మల్ని ముంచేశారు. ఈ సంవత్సరమైనా సకాలంలో సక్రమంగా పంట నమోదు చేసి ఆదుకోండ'ని అడిగితే ఆ రైతుపై సచివాలయం ఉద్యోగిని ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ నాయకుడి చొరవ వల్ల కేసు రాజీ అయింది.