వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడి జట్టు వివరాలను చేతన శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. ఫిట్‌నెస్ సాధించిన జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి పునరాగమనం చేయగా.. చాన్నాళ్లుగా టీ20లు ఆడని సీనియర్ పేసర్ మహ్మద్ షమిని ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా ఎంపిక చేయడం విశేషం. మూడు మార్పులు మినహా దాదాపు ఆసియాకప్ జట్టునే కొనసాగించారు. గాయంతో జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌కు అవకాశం ఇచ్చారు. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని స్టాండ్‌బైగా ఎంపిక చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. నిజానికి టీ20 ప్రపంచకప్ 2022 జట్టులో మహ్మద్ షమీని ఎంపిక చేయాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 15 మందితో కూడిన ఈ జట్టులో 14 మంది పేర్లను సెలక్టర్లు ఏకగ్రీవంగా నిర్ణయించారు. 15వ ఆటగాడి నిర్ణయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకే వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి కూడా వీరిద్దరూ హాజరయ్యారు. 15వ ప్లేయర్ రేసులో మహ్మద్ షమీ, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ అభిప్రాయాన్ని సెలెక్టర్లు కోరినట్లు తెలుస్తోంది. దాంతో.. బాగా ఆలోచించిన రోహిత్ శర్మ.. అశ్విన్‌కే ఓటేసినట్లు సమాచారం. దానికి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా మద్దతు తెలిపాడట. దాంతో షమీ స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు. అశ్విన్ బౌలింగ్ లైనప్‌లో ఉంటే వేరియేషన్ ఉండటంతో పాటు లెప్ట్ హ్యాండర్లను కట్టడి చేయచ్చని రోహిత్ శర్మ భావించినట్లు తెలుస్తోంది.